ఎడిటోరియల్ : చంద్రబాబుకు తొందరలో మరో షాక్ ?

Vijaya

అసలే ఘోర ఓటమితో కుంగిపోయిన చంద్రబాబునాయుడుపై మరో బాంబు పేలనున్నట్లు సమాచారం. అదేమిటంటే, త్వరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేయటానికి పార్టీ తరపున నేతలు ముందుకు రావటం లేదట. మామూలుగా అయితే స్ధానిక సంస్ధల ఎన్నికలు మొన్నటి జనరల్ ఎలక్షన్ కన్నా ముందే జరగాలి. అప్పట్లో ఈ ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే జనరల్ ఎలక్షన్స్ పై ప్రభవాం పడుతుందని చంద్రబాబు భయపడ్డారు.

 

అందుకనే నోటికొచ్చిన కారణాలు చెప్పి వాయిదా వేశారు. దానికితోడు పార్టీలోని సీనియర్  నేతలు కూడా స్ధానిక సంస్ధల ఎన్నికలు వద్దని అప్పట్లో చంద్రబాబుకు సలహా ఇచ్చారు. దాంతో చంద్రబాబు కూడా వాటిని అప్పట్లో వాయిదా వేశారు. మరి రేపటి పరిస్ధితి ఏమిటి ? అన్నదే ఇపుడు చంద్రబాబు అండ్ కో కు అర్ధం కావటం లేదు.

 

జనరల్ ఎలక్షన్ ను కారణంగా చూపించి అప్పట్లో ఎన్నికలు వాయిదా వేసారు సరే. మరి ఘోర పరాజయం తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఏం చేస్తారు ? అన్నది నేతల ముందున్న ప్రశ్న. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం అలా ఇలాంటిది కాదు. చంద్రబాబు ఐదు రోజులుగా ఇంటి నుండి బయటకే రావటం లేదు. కాబట్టి మిగిలిన నేతల సంగతి ఇక చెప్పాల్సిన పనేలేదు.

 

ఈ నేపధ్యంలోనే స్ధానిక సంస్ధలు అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపిటిసి, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయటానికి టిడిపిలో చాలామంది సాహసించటం లేదు. తనను కలసిన నేతలతో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించినపుడు చాలామంది ఏమీ స్పందించకుండానే వెనక్కు వచ్చేశారని సమాచారం.  660 జడ్పీటీసీలు, సుమారు 11 వేల ఎంపిటిసిలు, 13,060 సర్పంచుల పోస్టులను భర్తీ ఆగస్టులోగా భర్తీ చేయాల్సుంటుంది.

 

మొన్నటి ఫలితాల్లో టిడిపి అభ్యర్ధులపై పడిన దెబ్బ అందరికీ తెలిసిందే. చాలామంది ఎంఎల్ఏలు బంపర్ మెజారిటీతో గెలిచారు.  తొందరలో రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు వస్తాయని టిడిపి నేతలు అనుమానిస్తున్నారు. అందుకనే ఓటమి తప్పదని తెలసి పోటీ చేయటానికి చాలామంది నేతలు ఇష్ట పడటం లేదట.  

 

అధికారంలో ఉన్నపుడే జనాలు టిడిపి అభ్యర్ధుల మాడు పగలగొట్టారు. అలాంటిది ప్రతిపక్షం లోకి వచ్చిన తర్వాత జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసిపికి కాకుండా టిడిపికి ఓట్లు వేస్తారన్న నమ్మకం తమ్ముళ్ళల్లో ఏ కోశానా కనబడటం లేదు. అందుకనే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేయటానికి చాలామంది టిడిపి నేతలు వెనకాడుతున్నారట. నిజంగానే రేపటి ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ లేకపోతే చంద్రబాబుకు ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: