ఆ చాంబర్ అంటేనే భయపడిపోతున్నారు
రాజకీయాలన్నాక
సెంటిమెంట్లు తప్పవు. ఇపుడా సెంటిమెంటు విషయంలోనే మంత్రులు భయపడిపోతున్నారు. ఆ
చాంబర్ ను ఎవరికి కేటాయించినా అందులో చేరటానికి వెనకాడుతున్నారు. ఇంతకీ ఆ చాంబర్
ఎవరిదనుకుంటున్నారా ? ఇంకెవరిది నారా లోకేష్ దే.
లోకేష్ మంత్రిగా ఉన్నపుడు సచివాలయంలోని ఐదో బ్లాకు మూడో అంతస్తులోని రూం నెంబర్ 188లొ ఉండేవారు. మంత్రిగా ఉన్నంత కాలం లోకేష్ ఎన్ని ఆరోపణలకు గురయ్యారో ? ఎన్నిసార్లు నవ్వుల పాలయ్యారో అందరికీ తెలిసిందే. నిజానికి ఏ విధమైనా సామర్ధ్యం లేకపోయినా కేవలం చంద్రబాబునాయుడు కొడుకన్న ఏకైక అర్హతతోనే లోకేష్ మంత్రయ్యారు.
అయితే మంత్రైన దగ్గర నుండి లోకేష్ పై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయో కొత్తగా చెప్పక్కర్లేదు. పంచాయితీరాజ్, ఐటి, గ్రామీణాభివృద్ధి శాఖలకు మంత్రిగా పనిచేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సరే ఇవన్నీ ఒక ఎత్తైతే ఎన్నికల సమయంలో లోకేష్ అబాసుపాలైన ఘటనల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అందుకే చాంబర్ ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ప్రస్తుత మంత్రులెవరూ ఆ చాంబర్లోకి ప్రవేశించటానికి భయపడుతున్నారు. ఆ చాంబర్ కు వాస్తు ఏమాత్రం బావోలేదని అనుకుంటున్నారు. అందుకే పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేటాయిస్తే ఆయన వద్దు పొమ్మనేశారు. పోనీ ఇంకెవరికైనా కేటాయిద్దామంటే తీసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదని సమాచారం. దాంతో ఆ చాంబర్ ను ఏం చేయాలో ప్రభుత్వానికి అర్ధం కావటం లేదు.