తెలంగాణకు కొత్త అసెంబ్లీ.. ఎక్కడ కడతారు అంటే..?
అదేంటి తెలంగాణకు ఆల్రెడీ అసెంబ్లీ ఉంది కదా అనుకుంటున్నారా.. హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీ భవనం కొలువుదీరిన సంగతి తెలిసిందే. నిజాములు కట్టించిన ఈ భవనం రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది.
అయితే ఈ భవనాలు వందల ఏళ్ల నాటివి కావడంతో.. వాటి స్థానంలో కొత్త అసెంబ్లీ కట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం అనువైన స్థలాలను వెతుకుతోంది. ప్రస్తుతం ఈ అన్వేషణ ఓ కొలిక్కి వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎర్రమంజిల్ ప్రాంతంలో తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలు చాలా ఉన్నాయి. అవి కూడా పాత కాలం నాటివి. ఈ స్థలం తెలంగాణ కొత్త అసెంబ్లీ భవనాలకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ స్థలం ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లాక ఆయన పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ నెలలోనే తెలంగాణ కొత్త అసెంబ్లీకి కెసిఆర్ శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఈ నెల 27 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో కెసిఆర్ కొత్త అసెంబ్లీ విషయంలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.