ఎడిటోరియల్ : టిడిపిలో రాయలసీమ రెడ్ల భవిష్యత్తేంటి ?
రాయలసీమలో తెలుగుదేశంపార్టీ విచిత్రమైన పరిస్దితి ఎదుర్కొంటోంది. ఏ పార్టీ
అధికారంలో ఉన్నా మొదటి నుండి రెడ్డి సామాజికవర్గానిదే రాయలసీమలో ఆధిపత్యం అన్న
విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టిడిపి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. పార్టీ
సారధ్య బాధ్యతలు కమ్మ సామాజికవర్గం చేతిలోనే ఉన్నా రాయలసీమ వరకూ రెడ్లదే ఆధిపత్యం.
అలాంటి పార్టీ నుండి మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో రెడ్ల ఆధిపత్యం కాదుకదా కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటికి చాలా ఎన్నికలే జరిగిన మొన్నటి ఎన్నికల్లో మాత్రమే కనీసం ఒక్కరంటే ఒక్క రెడ్డి నేత కూడా టిడిపి నుండి గెలవలేదు.
రాయలసీమలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి 20 మంది రెడ్లు పోటీ చేశారు. అయితే ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. రాయలసీమలోని 8 ఎంపి సీట్లలో పోటి చేసిన రెడ్డి అభ్యర్ధుల్లో కూడా ఏ ఒక్కరూ గెలవకపోవటం విచిత్రంగా ఉంది. టిడిపి తరపున జేసి, కోట్ల, టిజి, భూమా, ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, బొజ్జల లాంటి అనేక మంది పోటీ చేసినా అడ్రస్ లేకుండా పోయారు.
నిజానికి వీళ్ళలో చాలామంది నేతలు టిడిపిలో ఆధిపత్యం చూపించినవారే. కాకపోతే ఏదో తుపాను వచ్చో లేకపోతే సునామీ ధాటికి ఇళ్ళన్నీ కూలిపోయినట్లు వాళ్ళ ఆధిపత్యం తుడిచిపెట్టుకుపోయింది. మొన్నటి ఎన్నికల ఫలితం తర్వాత టిడిపిలో తమకు భవిష్యత్తు లేదని చాలామందికి అర్ధమైపోయింది.
చంద్రబాబునాయుడుక వయసైపోవటం, నారా లోకేష్ సామర్ధ్యం ఏమిటో అందరికి అర్ధమైపోవటంతో టిడిపిలో ఉంటే రాజకీయంగా భవిష్యత్తు లేదని నిర్ణయానికి వచ్చేశారు. వీళ్ళల్లో చాలామంది తమ వారసుల భవిష్యత్తుపై బెంగపడుతున్నారు. అందుకే వీళ్ళల్లో చాలామంది అవకాశం ఉంటే వైసిపిలోకి కుదరకపోతే బిజెపిలోకి వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.