బోండా బెదిరింపుల‌కు బాబు లొంగుతారా... వార్నింగ్ ఇస్తారా..!

VUYYURU SUBHASH
ఎన్నికల్లో ఘోర ఓటమితో తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పింది. పార్టీ అధిష్టానం ఆదేశాలను ఎవరు పాటించడం లేదు. ఎవరికి తోచినట్టు వారు సభలు, సమావేశాలు పెట్టుకుని చంద్రబాబును, టిడిపి సీనియర్లను, లోకేష్‌ను తప్పు పడుతున్నారు. ఇంకా టిడిపిలో ఉండడం ఎందుకని భావించిన వారు బిజేపిలోకి జంప్ చేసేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీలోకి వెళ్ల‌లేనివారు మాత్రం మరో ఒకటి... రెండు సంవత్సరాలు వేచి చూద్దాం అన్న ధోరణితో ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఓడిపోయిన‌ప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో కాపుల కలకలం మొదలైంది. 


కాపులంతా ఇప్పటికే రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో కాకినాడలో సమావేశమై రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చేయాలని సమాలోచనలు జరిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో టిడిపి అధిష్ఠానం తమను చిన్నచూపు చూస్తుందని... చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో పాటు.... ఎన్నికల నిధుల విషయంలోనూ తమపై వివక్ష చూపించారు అన్న అసహనం కాపు నేతల్లో వ్యక్తమైంది. కాపు నేతల్లో మెజార్టీ నాయకులు టిడిపిలో భవిష్యత్తు లేదని ఓ నిర్ణయానికి వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపిలోకి వెళ్ళే దారి లేనిపక్షంలో బిజెపిలోకి వెళ్లడమే కరెక్ట్ అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 


ఒకరిద్దరు నేతలు వైసిపిలోకి వెళ్తే ఎలా ఉంటుంద‌ని చ‌ర్చించినా జ‌న‌సేన వైపు మాత్రం ఎవ్వ‌రూ ఆస‌క్తి చూప‌లేద‌ట‌. పార్టీలో కాపు నేతలు అసంతృప్తితో ఉన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు ఇప్పటికే వారికి స్వయంగా ఫోన్ చేసి బుజ్జగింపులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సోమవారం వీరితో గుంటూరు టిడిపి కార్యాలయంలో ఆయన భేటీ అవుతున్నారు.  ఇదిలా ఉంటే విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు పరోక్షంగా చంద్రబాబును బెదిరించే ధోరణితో వ్యవహరిస్తున్నట్టు టిడిపి రాష్ట్ర  వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందుగా బోండా పార్టీ మారిపోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. దీంతో చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి సముదాయించారు. 


అయితే పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి కొందరు నేతలు సెంటర్ నియోజకవర్గంలోని కార్పోరేటర్‌లతో పాటు కొందరు టీడీపీ కీలక నేతలకు ఫోన్లు చేసి బోండా ఉమా పార్టీ మారిపోతే అక్కడ  మన పార్టీ నుంచి ఎవరు సరైన అభ్యర్థి అవుతారని ఆరా తీశారు. ఈ విషయాన్ని తన అనుచరుల ద్వారా తెలుసుకున్న బోండా ఉమా టిడిపి అధిష్టానంపై ఒక్కసారిగా ఫైర్ అయిపోయారట. తాను పార్టీ మారడం లేదని నేరుగా చంద్రబాబుకే క్లారిటీ ఇచ్చినా తనపైనే అనుమానంతో ఉంటారా ? అని నానా రచ్చ రచ్చ చేయడంతోపాటు పార్టీలో తమకు జరిగిన అన్యాయంపై బహిరంగంగానే నోరెత్తుతాన‌ని లీకులు ఇచ్చారట. 


గతంలో మంత్రి వర్గ ప్రక్షాళనలో తనకు మంత్రి పదవి రాలేదని బోండా నానా రచ్చ రచ్చ చేసి చంద్రబాబు కాపుల గొంతు కోశార‌ని విమ‌ర్శించారు. ఈ వీడియో అప్ప‌ట్లో పెద్ద వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు తిరిగి మరోసారి కాపు కార్డును వాడుతూ బోండా చంద్రబాబును బెదిరించే ధోరణితో వెళ్తున్నట్టు టిడిపి వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మరి సోమవారం సమావేశంలో ఉమా దూకుడుకు చంద్రబాబు బ్రేకులు వేస్తారా ? లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: