చంద్రబాబు అండతో "లింగమనేని" ఇంతగా రెచ్చిపోయారా..?
లింగమనేని రమేశ్.. అంతకుముందు పెద్దగా పాపులర్ కానీ ఈ పేరు.. కృష్ణాతీరంలోని లింగమనేని ఎస్టేట్ లో చంద్రబాబు నివాసం ఉండటంతో ఒక్కసారిగా పత్రికలకు ఎక్కింది. నదీతీరంలో అనుమతులు లేకుండా అక్రమంగా కట్టారని ఆరోపణలు ఉన్న తన ఇంట్లో ఏకంగా ముఖ్యమంత్రే అద్దెకు ఉండటంతో లింగమనేని పరపతి విపరీతంగా పెరిగిందని చెబుతారు.
చంద్రబాబు అండతో లింగమనేని గుంటూరు జిల్లాలో కోట్లు దోచేశారని తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. కేవలం తన నియోజకవర్గంలోనే లింగమనేని 40 నుంచి 50 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆర్కే ఆరోపిస్తున్నారు. ఐదేళ్లలో జరిగిన భూబాగోతాలపై దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ఆర్కే తెలిపారు.
లింగమనేని 40 ఎకరాల్లో లే ఔట్లు వేసి..విలాసవంతమైన విల్లాలు కట్టారట. ఒక్కొక్క విల్లాను రూ. 5 కోట్లకు అమ్ముకుని, లే ఔట్ ఫీజులు చెల్లించలేదట. బిల్డింగ్ పర్మిట్, గ్రామ పంచాయతికి కట్టాల్సిన లే ఔట్ ఫీజు ఇప్పటిదాకా కట్టలేదట. గజం భూమి విలువ రూ. 4 వేలుగా చూపించి 50 నుండి 60 కోట్ల పన్ను ఎగవేశారట.
250 కోట్లరూపాయల విలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన లింగమనేని రమేశ్ ను చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చారంటున్నారు ఆర్కే. కరకట్టలో తనకు ఇల్లు ఇచ్చినందుకే చంద్రబాబు లింగమనేనికి అండగా నిలుస్తున్నారని అంటున్నారు. మరి ఈ ఆరోపణలపై చంద్రబాబు, లింగమనేని ఎలా స్పందిస్తారో చూడాలి.