ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. మొత్తం రాష్ట్రంపై 3,62,140 కోట్ల అప్పు ఉందని చెప్పారు. ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మరోసారి అధికార... ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరగటం ఖాయం అన్న అంచనాలు ఉన్నాయి. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే సభ్యుల ప్రమాణ స్వీకార సందర్భంగా అధికార వైసిపి... విపక్ష టిడిపి నేతల మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది.
ఇక కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో మరోసారి అసెంబ్లీ దద్దరిల్లిపోతుందని... ప్రతిపక్షం ప్రతి విషయంలోనూ అధికారపక్షానికి ఆటంకం కలిగిస్తుంది అని అందరు అనుకున్నారు. ఇలా ఉంటే అనూహ్యంగా సీఎం జగన్ ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తామని హామీ ఇవ్వడంతో దీనిపై టిడిపి ఎమ్మెల్యేల నుంచి సానుకూల స్పందన వచ్చింది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పరిష్కరించే విషయంలో జగన్ ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తామని ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నట్టు టీడీఎల్పీ ఉపనేత అచ్చెనాయుడు తెలిపారు. బిఎసి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై పాజిటివ్ దృక్పథంతో మాట్లాడటం విశేషం.
సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయానికి టీడీపీ నుంచి ప్రశంసలు రావడాన్ని బట్టి చూస్తే టీడీపీ వాళ్లు జగన్ విషయంలో దూకుడుగా ముందుకు వెళితే పనవ్వదని.. ప్రజల్లో తమపై మరింత వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని గ్రహించినట్లు ఉన్నారు. ఇక జగన్‌ను ఐదేళ్లుగా తీవ్రంగా విమర్శించిన అచ్చెన్నాయుడు లాంటి నేతలే స్వయంగా జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తుండడం మామూలు విషయం కాదు. ప్రభుత్వం అనేక అంశాలు చర్చించాలని నిర్ణయం తీసుకుందని... దానికి ఎక్కడా అడ్డురాకుండా ఉంటామని తెలిపారు. కరవుపై కూడా చర్చించాలని కోరామన్నారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని వివరించారు.