పోలవరం అవినీతిపై తొందరలో సిబిఐ విచారణ ?
పోలవరం ప్రాజెక్టును
చంద్రబాబునాయుడు కల్పతరువుగా ఉపయోగించుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
పోలవరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన
నిపుణుల కమిటి నిర్ధారించింది. పోలవరంను
చంద్రబాబు ఏటిఎంగా ఉపయోగించుకుంటున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే
వ్యాఖ్యానించారంటేనే అర్ధమైపోయింది పోలవరంలో ఏ స్ధాయిలో అవినీతి జరిగిందో.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తేల్చేందుకు ఓ నిపుణుల కమిటిని నియమించింది. ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు లాంటి టెక్నికల్ టీంతో కూడా మాట్లాడి, లెక్కలు తవ్వి తీసిన తర్వాత నిపుణుల కమిటి ప్రాధమికంగా రూ 3128 కోట్లు అవినీతి జరిగినట్లు నిర్ధారించింది.
ప్రాజెక్టులోని హెడ్ వర్క్స్ లో రూ. 1559 కోట్లు, జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రూ. 787 కోట్లు, ఎడమ కాలువ పనుల్లో రూ. 492 కోట్లు, కుడి కాలువ పనుల్లో 288 కోట్ల రూపాయలు దోచేసినట్లు నిర్ధారించింది కమిటి. పై విభాగాల్లో కొన్ని పనులను అంచనాలు పెంచేసి, ఒకటే పనిని మళ్ళీ మళ్ళీ చేసి కూడా డబ్బులు నొక్కేసినట్లు లెక్కల్లో బయటపడినట్లు తెలుస్తోంది.
దోచేసిన వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు సంస్ధల నుండి రికవరీ చేయాలని కూడా నిపుణుల కమిటి ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇది సాధ్యమేనా అన్నదే పెద్ద సమస్య. కాంట్రాక్టు సంస్ధలు డబ్బులు తీసుకోవటమే కానీ లీగల్ గా వెనక్కు ఇవ్వటం అన్నది సాధ్యంకాదు. కోర్టు ద్వారా మాత్రయే ఏమైనా సాధ్యమేమో పరిశీలించాలి. ఒకసారి కోర్టుకంటూ ఎక్కితే అది ఎప్పటికి తెమిలేను ? బహుశా ఇదే అంశంపై కేంద్రానికి సిఫారసు చేస్తారేమో సిబిఐ విచారణ జరిపించాలని ?