మేం అధికారంలోకి వస్తే.. అవినీతి రహిత పాలన అందిస్తాం. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలను చేరువ చేస్తాం. పాలన ను పారదర్శకంగా చేరువ చేస్తాం. ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా ప్రజలు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సేవలను ఉచితంగానే పొందవచ్చు- సహజంగా ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు తరచుగామనకు అనేక పార్టీల నుంచి వినిపిస్తాయి. అయితే, ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో అటు అప్పటి అధికార టీడీపీ కానీ, ప్రతిపక్షం వైసీపీ కానీ ఇలాంటి ప్రకటనలు ఎక్కడా చేయలేదు. పైగా అవినీతి రహితం ఎక్కడా ఒక్క ముక్కకూడా మాట్లాడలేదు. కానీ, జగన్ భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నాక మాత్రం అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు.
సీఎంగా ఇంకా ప్రమాణం చేయకముందుగానే ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. దీంతో ప్రజాస్వామ్య వాదులు బిత్తర పోయారు. ఉరుములు లేని పిడుగులా జగన్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం పెను సంచలనంగా మారింది. ఇక, ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టుల్లో అవినీతి పారిందని, వాటిపైనా విచారణ సాగిస్తామని వెల్లడించారు. చెప్పిందే తడవుగా అవినీతి రహిత పాలన అందించేందుకు కసరత్తు కూడా ప్రారంభించారు.
ఆగస్టు 15వ తేదీ నేరుగా సీఎంవో ఆఫీస్‌లోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరైనా సరే అవినీతి బాధితులు ఈ ఫోన్ చేసి.. తమ గోడును నేరుగా సీఎంకే విన్నవించుకునేలా ఏర్పాట్లు చేశారు. మరి ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్‌కు పంటి కిందరాయిలా కొన్ని నిర్ణయాలు, కొన్ని వెసులుబాట్లు ఇబ్బంది పెడుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో పని చేస్తామని కొందరు పరాయి రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లు క్యూకడు తున్నారు. వీరికి మాతృభూమిపై మమకారం ఉండి ఉండొచ్చు. అయితే, ఇలా వినిపిస్తున్న పేర్లలో కొందరికి జగనే ఆఫర్ ఇస్తుండగా, కొందరు తమంతట తాముగా జగన్‌ను బ్రతిమాలుకుంటున్నారు.
వాస్తవానికి ఇలాంటి నిర్ణయాలు తప్పుకావు. పరాయి రాష్ట్రంలో చేస్తున్న సేవను సొంత గడ్డలోని ప్రజలకు అందించాలనే వారి కోరికను అభినందించాల్సిందే. అయితే, ఇలా వస్తామని చెబుతున్న అధికారుల్లో చాలా మందిపై సీబీఐ సహా ఈడీ కేసులు, డిపార్ట్మెంట్ ఎంక్వయిరీలు కొనసాగుతుండడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అది కూడా భారీ భారీ అవినీతి కేసుల్లో వారు విచారణ ఎదుర్కొంటున్నారని సమాచారం. మరి ఇలాంటి వారిని తన పాలనలో చేర్చుకుని రాష్ట్ర ప్రజలకు ఏవిధమైన అవినీతి రహిత పాలన అందిస్తారనేది ఇప్పుడు జగన్‌ను చుట్టుముడుతున్న ప్రధాన ప్రశ్న. మరి దానికి ఆయన ఏం సమాధానం చెబుతారో చూడాలి.