హైదరాబాద్ మెట్రో.. ఈ షాకింగ్ వార్తలన్నీ వదంతులేనా..?
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు అనూహ్య ప్రమాదంలో చిక్కుకుందన్న వార్తలు శనివారం సాయంత్రం దాదాపు అన్ని మీడియాల్లోనూ వచ్చాయి. ఒక రూట్ లో వెళ్లవలసిన మెట్రో మరో రూట్ లో రావడంతో పెద్ద ప్రమాదమే జరిగే పరిస్థితి ఏర్పడిందని బ్రేకింగులతో ఊదరకొట్టాయి. అంతా సకాలంలో అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పిందని న్యూస్ వండి వార్చాయి.
ఈ ఘటన సమయంలో మెట్రో రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారట. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లాల్సిన మెట్రో రైలు పొరపాటున మరో ట్రాక్‌లోకి వెళ్ళిందని కొన్ని ఛానల్స్, వెబ్ సైట్లు రాసుకొచ్చాయి.
పొరపాటును గుర్తించిన డ్రైవర్... లక్డీకపూల్ స్టేషన్లో రైలును నిలిపివేశాడని.. ప్రయాణికులను అక్కడ దించి వేసి రైలు వెనక్కి వెళ్లిందని చెప్పుకొచ్చాయి. వ్యతిరేక దిశలో మరో రైలు వచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని.. భయపెట్టేశాయి.
మొదట ఓ ఛానళ్లో వచ్చిన ఈ బ్రేకింగ్ న్యూస్.. తర్వాత మిగిలిన ఛానళ్లలోనూ వచ్చింది. అయితే కొన్ని ఛానళ్లు మాత్రం సంయమనం పాటించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి హైదరాబాద్ మెట్లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ వార్తలన్నీ వదంతులేనని కొట్టిపారేశారు.
హైదరాబాద్ మెట్రో రైలులో ఎలాంటి తప్పిదం జరగలేదని ఆయన తన ప్రకటనలో తెలిపారు. భారీ వర్షం, గాలుల కారణంగా... పిడుగులను ఆకర్షింటే పోల్ విరిగి మెట్రో పట్టాలపై పడిందని.. ఆ విషయం గుర్తించి.. దాన్ని తొలగించడానికి అరగంట సమయం పట్టిందని వివరించారు. అదే సమయంలో మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆస్తమాతో తీవ్రంగా బాధపడుతుండటంతో అతన్ని దింపేందుకు కొద్దిసేపు రైలు ఆపామని చెప్పారు.
మీడియా తప్పుడు వార్తల ద్వారా ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేయవద్దని సూచించారు. మరోసారి ఇలాంటి తప్పుడు వార్తలు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు. పోల్ పట్టాలపై విరిగిపడిన ఫోటోను ఆయన విడుదల చేశారు.