అన్నా క్యాంటీన్ల ఫ్యూచర్ ఏంటి..? : అసెంబ్లీలో కీలక ప్రకటన
అన్నా క్యాంటీన్లు.. చెన్నైలోని అమ్మ క్యాంటీన్ల స్ఫూర్తితో చంద్రబాబు సర్కారు రూపొందించిన పథకం ఇది. 2014 ఎన్నికల హామీల్లో భాగంగా దీన్ని అమలుకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టుంది. అయితే.. అధికారంలో ఉన్న నాలుగేళ్లూ ఈ హామీపై మాటలు చెబుతూ వచ్చిన చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ క్యాంటీన్లను ప్రారంభించారు.
అయితే జగన్ సర్కారు వచ్చిన తర్వాత ఈ క్యాంటీన్ల భవితవ్యంపై నీలినీడలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల అన్న క్యాంటీన్ల పేరు తీసేసి రాజన్న క్యాంటీన్లుగా పేరు మార్చారు. ఆ తర్వాత అసలు వీటిని ఎత్తేస్తున్నారన్న ప్రచారం కూడా సాగింది. దీంతో ఈ క్యాంటీన్ల సిబ్బంది ధర్నాలు కూడా చేయడం మొదలు పెట్టారు.
సో.. ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని జగన్ సర్కారు భావించింది. మంత్రి బొత్ససత్యనారాయణ అసెంబ్లీలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. పేదవాడి కడుపుకొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని.. అన్నా క్యాంటీన్లను మూసివేయడం లేదేని తెలిపారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
అన్నా క్యాంటీన్లను పెట్టి టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని, వాటిని ప్రక్షాళన చేయాలని కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి కోరారు. ఈ క్యాంటీన్ల పేరిట టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, మార్చురీ పక్కన కూడా పెట్టారని ఆర్కే మండిపడ్డారు.
ఫైనల్ గా బొత్స మాట్లాడుతూ... అన్న క్యాంటీన్లను పూర్తి ప్రక్షాళన చేసి.. ప్రజలకు మేలు చేకూర్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 183 అన్నా క్యాంటీన్లు ఉన్నాయని.. వాటిని మూసేసే ఆలోచన లేదని.. తేల్చి చెప్పారు.