జ‌గ‌న్ - బాబుకు ఎంత తేడా... ఈ ఒక్క ఇష్యూ చాలు...

VUYYURU SUBHASH
మాటలతో పొట్ట నిండదు..! ఈ సామెత అందరికీ తెలిసిందే. అయితే, నాయకులు అన్నాక నేటి తరంలో సగానికి పైగా అవే ఉంటున్నాయి. ఇంకేముంది.. నేను తలుచుకుంటే.. అంటూ నిమిషానికో మీడియా సంస్థను ఎంచుకుని కుండపోత మాటలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడం నాయకులకు పరిపాటి. ఈ విషయాన్ని మనం గత పాలకుడు చంద్రబాబు వద్ద చూశాం. ఆయన ఎక్కడున్నా ఓ వర్గం మీడియా ఆయన చుట్టూ తిరుగతూనే ఉంటుంది. బాబు దృష్టిలో ప్రతి విషయమూ ప్రచారాస్త్రమే..! ఏదో ఒక విషయంతో ఆయన మీడియా ముందుకు రావాల్సిందే. ఇక, మీడియా గొట్టం కనిపిస్తే.. గత చరిత్ర తొవ్వుతూ.. వర్తమానాన్ని ఏకరువు పెట్టడంలో ఆయనకు సాటి బహుశ.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశరాజకీయాల్లో కూడా ఎవరూ ఉండరు. 


చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లినా.. మీడియాను వెంటబెట్టుకుని వెళ్లేవారు. చివరికి ఆయన విమానంలో ఉన్నా.. మీడియాను వదిలేవారు కారు. కేవలం ఆయన నిద్రకు ఉపక్రమించిన ఓ ఐదు గంటలు మినాహాయిస్తే.. ఎంతసేపూ.. ఆయన మీడియాలో ఉంటూ.. ప్రచారాన్ని కోరుకునేవారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవడానికి వెళ్తే ఇక, చెప్పక్కర్లేదు. కలవడానికి ముందు, కలిసిన తర్వాత కూడా ఆయన ప్రెస్‌ మీట్‌లు పెట్టేవారు. 


ఇక, అక్కడి నుంచి ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత అర్దరాత్రుళ్లు కూడా మీడియాను పిలిపించుకుని చెప్పిందే చెప్పేవారు. అదే ఆయనకు పెద్ద మైనస్‌ అయిందనే విషయం ఆయనిప్పటికీ గ్రహించలేక పోయారు. అయితే, దీనికి భిన్నంగా ప్రస్తుత సీఎం, వైసీపీ అధినేత జగన్‌ వ్యవహరిస్తున్నారు. 
జగన్‌ తన మాటల ద్వారా ఎలాంటి ప్రచారం కోరుకోవడం లేదు. కేవలం తన చేతల ద్వారానే ప్రజల్లో నిత్యం ఆయన పేరు మార్మోగేలా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఢిల్లీ వెళ్లినా ఏ మీడియా సంస్థనూ ఆయన వెంటబెట్టుకుని వెళ్లలేదు. 


ఇదే విషయంపై ఎంపీ సాయిరెడ్డి జగన్‌తో ఒక మాట అన్నారు. మన మీడియానైనా తీసుకువెళ్దాం అని! అయితే, దీనికి జగన్‌.. అక్కడ మీడియా ఉండదా?  ప్రత్యేకంగా తీసుకు వెళ్లడం ఎందుకు? ప్రజాధనాన్ని వృథా చేయడం ఎందుకు? అని . దీంతో అందరూ మౌనం వహించారు. ఇక, ఢిల్లీలో సీఎం తొలుత రెండు రోజుల పర్యటన అనుకున్నా.. తర్వాత దానిని మూడో రోజు వరకు పెంచుకున్నారు. అయినా కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు. అంతేకాదు, తాను చెప్పాలని అనుకున్న విషయాన్ని మీడియాకు సూటిగా, సుత్తిలేకుండా చెప్పడంలో జగన్‌ ఎక్స్‌పర్ట్‌. సో.. ఇదీ.. జగన్‌కు బాబుకు తేడా అంటున్నారు పరిశీలకులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: