పారిశ్రామికవేత్తలకు భరోసా

Vijaya

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలచుకున్న పారిశ్రామికవేత్తలకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. విజయవాడలో మొదలైన పెట్టుబడుల సదస్సులో జగన్ మాట్లాడుతూ అవినీతి రహిత పాలనను అందిస్తున్న విషయాన్ని వివరించారు. 975 కిలోమీటర్ల సుదీర్ఘమైన సముద్ర తీరం ఉన్న ఏపిలో పెట్టుబడులు పెట్టటానికి ఉన్న అవకాశాలను వివరించారు.

 

పరిశ్రమలను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల తగ్గింపుకు చర్యలు, మౌళిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే తీసుకున్న అనేక విప్లవాత్మక చర్యలను వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్ ఎంత ముఖ్యమో తెలుసు కాబట్టే విద్యుత్ పిపిఏలతో ధరల తగ్గింపు విషయమై చర్చిస్తున్నట్లు చెప్పారు.

 

పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉన్నంతలో సబ్సిడీలు ఇవ్వటానికి తమ ప్రభుత్వం అవసరమైన అన్నీ కసరత్తులు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించటానికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో  కృషి చేస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటులో స్ధానికులకు 75 శాతం ఉద్యోగవకాశాలపై చేసిన చట్టాన్ని కూడా వివరించారు. తమ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న ఫ్యాక్టరీల్లో తమకు ఉద్యోగాలు రాకపోతే స్ధానికులకు భూములు ఎందుకు ఇస్తారంటూ జగన్ పారిశ్రామికవేత్తలను, అంబాసిడర్లను ప్రశ్నించారు.

 

వివిధ పరిశ్రమల్లో ఉద్యోగవకాశాలు రావాలంటే అందుకు కావాల్సిన నైపుణ్యాలు, అర్హతలను తాము స్ధానికుల్లో కలిగిస్తామని జగన్ హామీ ఇచ్చారు. స్ధానికుల మద్దతు లేకుండా ఏ పరిశ్రమ కూడా సక్రమంగా రన్ అయ్యే అవకాశాలు లేవని జగన్ సూటిగా స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలను, ఇవ్వబోయే ప్రోత్సాహకాల గురించి సూటిగా స్పష్టంగా వివరించారు. ఐదేళ్ళల్లో నాలుగు పోర్టులు రానున్నట్లు చెప్పారు.  రిఫైనరీలు, స్టీలు పరిశ్రమలు, పోర్టులు, విమానాశ్రయాలు అందుబాటులో ఉన్న కారణంగా పరిశ్రమలు పెట్టాలంటూ పారిశ్రామికవేత్తలను జగన్ కోరారు. సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారుల్లో కొందరితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారి సందేహాలను తీర్చేందుకు సమయం కూడా కేటాయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: