ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు వ్యవహారం రోజు రోజుకు మరింతగా ముదిరిపోతుంది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల్లో కోడెల ఫ్యామిలీ టార్గెట్‌గా ఎంతోమంది బాధితులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ రెండున్నర నెలల్లో కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మి, కుమారుడు కోడెల శివరామ్ ప్రసాద్ పై లెక్కకు మిక్కిలిగా కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌తో పాటు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఇలా ప్రభుత్వ సొమ్మును దొరికిన కాడకు దొరికినట్టుగా దొంగిలించిన కోడెల ఫ్యామిలీ మెంబర్స్ బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
చివరకు అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో కోడెల సైతం స్వయంగా తప్పు ఒప్పుకోవడంతో టీడీపీ నేతల నుంచే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో… గుండెపోటు వచ్చిందంటూ కోడెలను వాళ్లకు చెందిన ఆస్పత్రిలోనే చేర్చారు కుటుంబ సభ్యులు. ఈ వ్యవహారం పై చంద్రబాబు తాజాగా స్పందించారు. కోడెల అక్రమాలకు పాల్పడితే శిక్షించవచ్చని.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కోడెలను కాపాడేందుకు మనం ఏ మాత్రం ప్రయత్నాలు చేయవద్దని... ఆయన్ను వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తే టోటల్‌గా పార్టీ పుట్టి మునిగిపోతుందని చెప్పారట. దీంతో గుంటూరు జిల్లా నేతలు కూడా కోడెల వ్యవహారంలో అంటీఅంటనట్టుగా ఉంటున్నారు.
రాయపాటితో చెక్కు రెడీ... ఇప్పటికే మూడున్నర దశాబ్దాలుగా నరసరావుపేటలో రాజకీయాలు చేస్తున్న కోడెలను చంద్రబాబు ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో అక్కడ నుంచి కదిలించారు. ఆయన అధికారాన్ని సత్తెనపల్లి కి పరిమితం చేశారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ పరంగా అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో పాటు.. అటు నియోజకవర్గ ప్రజల్లోనూ కోడెలపై తీవ్రమైన వ్యతిరేకత ఉండటం... సీనియార్టీ నేపథ్యంలో కోడెలను పక్కన పెట్టి నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ కేడర్ సైతం తమకు కోడెల వద్దని కూడా ముక్తకంఠంతో చెబుతోంది. పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు సత్తెనపల్లి ఇన్చార్జిగా నియమించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు ఆ దిశగా సంకేతాలు కూడా వచ్చాయని అంటున్నారు. నియోజకవర్గ టిడిపి నేతలు సైతం తమ నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యకలాపాలకు.. ఇతర ఫంక్షన్లకు రంగబాబును ఆహ్వానిస్తున్నారు. రంగబాబు సైతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు.
ఎన్నికలకు ముందే రంగబాబు సత్తెనపల్లి సీటు ఆశించినా దక్కలేదు. ఇక ఇప్పుడు కోడెలను పక్కన పెట్టేస్తే... ఆయన వారసుడు శివరాంకు పార్టీలో ఎలాంటి ఛాన్స్ ఉండదని అర్థమైంది. ఇంకా చెప్పాలంటే శివరాంను చంద్రబాబు దగ్గరకు రానిచ్చే పరిస్థితి కూడా లేదట. ఓవరాల్‌గా జిల్లా రాజకీయాల్లో కోడెల శకం దాదాపుగా ముగిసినట్టే.