మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు చుట్టూ మరో వివాదం

NAGARJUNA NAKKA
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కే ట్యాక్స్‌.. తిరుపతికి పాకింది. రుయా ఆస్పత్రిలో కోడెల కుమారుడు తన బినామీ ద్వారా కోట్ల రుపాయలను నొక్కేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. రుయా ఆసుపత్రిలో ల్యాబ్ కేంద్రంగా జరిగింది. 


అసెంబ్లీ ఫర్నీచర్‌ వివాదం ముగియక ముందే... కోడెల శివప్రసాదరావు చుట్టూ మరో వివాదం ముదురుతోంది. తిరుపతి రుయా ఆస్పత్రిలో కే ట్యాక్స్ వసూలు చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కోడెల తనయుడు శివరాం బినామీ ద్వారా ప్రతీనెల 40లక్షల రుపాయలు వసూలు చేసినట్టు తెలిసింది. ఐదేళ్లలో కోట్ల రుపాయలు కే ట్యాక్స్‌ పేరుతో మామూళ్లు పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో ల్యాబ్‌ల నిర్వహణను అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడాల్‌ సంస్థకు అప్పగించింది. తిరుపతి, గుంటూరు ఆస్పత్రుల్లో మాత్రం లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్‌ ల్యాబ్‌కు అప్పగించారు. కోడెల శివరాం బినామీ మనోజ్‌కు చెందినదే ఈ లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్‌ ల్యాబ్‌. తిరుపతి రుయా ఆస్పత్రిలో రూ.4 కోట్లకు పైగా విలువైన అత్యాధునిక పరికరాలున్నాయి. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన నిపుణులు ఉన్నారు. అయినప్పటికీ అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ఒత్తిడి మేరకు రుయా ఆస్పత్రిలో ల్యాబ్‌ నిర్వహణను లక్ష్మీ వెంకటేశ్వర క్లినికల్‌కు ల్యాబ్‌ను అప్పగించారన్నది ప్రధాన ఆరోపణ. 


ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్‌ఐవీ టెస్టు చేయడానికి 150 తీసుకుంటారు. కానీ లక్ష్మీవెంకటేశ్వర సంస్థ మాత్రం 850 వసూలు చేస్తోంది. 80తో చేసే థైరాయిడ్‌ టెస్టుకు ఏకంగా 350 రుపాయలు దండుకున్నారు. వైద్య పరీక్షల పేరిట ప్రతినెలా రోగుల నుంచి 40 లక్షల దాకా వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ పరీక్షలను రుయా ఆస్పత్రి నిపుణులు సొంతంగా నిర్వహిస్తే కేవలం రూ.15 లక్షలే ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే లక్ష్మీవెంకటేశ్వర క్లినికల్‌ ల్యాబ్‌ ప్రతినెలా 25 లక్షల రుపాయలు అధికంగా పిండుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఈ లెక్కన గత ఐదేళ్లలో 15 కోట్లు అదనంగా వసూలు చేసినట్టు  సమాచారం. ఈ వ్యవహారంపై సీరియస్‌ అయిన కలెక్టర్‌...లక్ష్మీ వెంకటేశ్వర క్లినికల్‌ను తప్పించారు. ప్రభుత్వమే ల్యాబ్ నిర్వహించే చర్యలు చేపట్టారు. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డబ్బును రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు జనం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: