ఇలా చేస్తే.. మీ బిల్లు సగానికి సగం తగ్గిపోతుంది..!

Chakravarthi Kalyan

ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదైపోయింది. డాక్టర్ ఫీజులు, మందుల రేట్లు బాగా పెరిగిపోయాయి. కానీ జబ్బు చేసినప్పుడు వైద్యం తప్పనిసరి కదా. అలా మధ్యతరగతి ఇంటి బడ్జెట్ లో మందులు భారంగా మారుతున్నాయి. అయితే మందుల ఖర్చు తగ్గించుకునేందుకు ఓ మార్గం ఉంది. అదే జనరిక్ మందుల కొనుగోలు.


అసలు బ్రాండెడ్ మందులంటే ఎంటో, అలాగే జనరిక్ మందులంటే ఏంటో ముందు తెలుసుకుందాం.. ఏదైనా ఒక కొత్త మందును, ఒక ఫార్మా కంపెనీ మా‌ర్కెట్ లోకి తెస్తే, దానిపై ఆ కంపెనీకి 20 సం.లు పేటెంట్ హక్కులు ఉంటాయి. అంటే ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా సరే, దానిని ఓ 20 సం.ల పాటు కాపీ కొట్టి వేరే ఎవరూ తయారు చేయకూడదు. అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు.


మొదటి కంపెనీ, తన మందుకు ఒక పేరును కూడా పెట్టుకుంటుంది. ఆ మందుకు ఆ కంపెనీ పెట్టుకున్న పేరే "బ్రాండ్ నేం" లేదా ఆ మందును "బ్రాండెడ్ మందు" అంటారు. దానిపై ఆ ముందు యొక్క (కెమికల్) ఫార్ములా కూడా ఉంటుంది. డాక్టర్లు ఎపుడూ మందు లేబుల్ పై ముద్రించబడి ఉండే ఈ ఫార్ములా పేరే రాయాలి, బ్రాండ్ నేం ఎపుడూ రాయకూడదు. ఒక వేళ బ్రాండ్ నేం రాయాలనుకుంటే.. ముందుగా ఆ మందు యొక్క ఫార్ములాను పెద్దక్షలాతో రాసి, ఆటుతర్వాత కింద బ్రాకెట్లో, చిన్నక్షరాలతో బ్రాండ్ నేం రాయవచ్చు..


మందుపై మొట్టమొదటి కంపెనీ యొక్క పేటెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును అదే కంపెనీ లేదా మరేదైనా కంపెనీ.. తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు.. అదే ఫార్ములాతో, అవే కెమికల్స్ తో అదే మందును వేరే కంపెనీ తయారు చేస్తే, ఆ మందుకు తను స్వంతంగా పెట్టుకున్న మరో పేరుతో మార్కేట్ లోకి విడుదల చేస్తుంది. అది కూడా బ్రాండ్ నేం కిందికే వస్తుంది. దాని రేటు కూడా అధికంగానే ఉంటుంది..


ఐతే ఒక మందుపై పేటెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత అవే కెమికల్స్ తో, అవే ఫార్ములాతో తయారు చేసి 30 నుండి 80 శాతం తక్కువ ధరలతో "జనరిక్" షాపుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలా తక్కువ ధరలకు, జనరిక్ షాపుల్లో అమ్మే మందులనే జనరిక్ మందులంటారు. వీటిపై ముద్రించబడే యం ఆర్ పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు..బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు. బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: