త్వరలో శాసససభ్యులకు ప్రవర్తనా నియమావళి

NAGARJUNA NAKKA
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభ్యులకు త్వరలో ప్రవర్తనా నియమావళి అమలులోకి రాబోతోంది. ఎమ్మెల్యేల కోడ్ ఆఫ్ కండక్ట్‌ను నిర్ణయించేందుకు అసెంబ్లీ స్పీకర్లతో ఓ ప్యానెల్‌ ఏర్పాటయ్యింది. చట్ట సభల్లో సభ్యుల ప్రవర్తన, సభా సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. 


శాసన సభ, శాసన మండలి, లోక్‌సభ, రాజ్యసభ... చట్ట సభలు ఏవైనా సరే...ఈ మధ్య కాలంలో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చల కంటే... రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాయిుదాలతోనే విలువైన సభాసమయం వృధా అయిపోతోంది. వివిధ చట్ట సభల్లో సభ్యుల ప్రవర్తన కూడా  శృతి మించుతున్న సందర్భాలను చూస్తున్నాం. దీంతో దేశవ్యాప్తంగా శాసనవ్యవస్థల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాలకు చెందిన శాసనససభ స్పీకర్లు, మండలి ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల స్పీకర్లు తమ్మినేని సీతారాం, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.


దేశవ్యాప్తంగా స్పీకర్ల వ్యవస్థ సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అభిప్రాయం సమావేశంలో వినిపించింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం కారణంగా భిన్న రాజకీయ పరిస్థితుల్లో నైతికత, సిద్ధాంతాలను పక్కనపెడుతున్నారన్న ఆందోళన వ్యక్తమయింది.  సభలు చేసిన చట్టాలను కూడా సభ్యులు గౌరవించే పరిస్థితుల్లో లేరని స్పీకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సభలో సభ్యుల ప్రవర్తన, సభా సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్ ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల కోడ్ ఆఫ్ కండక్ట్‌పై  స్పీకర్ల ప్యానెల్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫిరాయింపుల చట్టంపై చర్చించేందుకు కూడా కమిటీ వేయాలని స్పీకర్ల సదస్సు నిర్ణయించింది. ఉగాండాలో జరిగే స్పీకర్ల సదస్సులో చర్చించేందుకు 10 అంశాలను ఎంపిక చేశారు. మరి ఆ చర్చలు అమల్లో ఎలా ఉండబోతాయో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: