వాలంటీర్ల పైనే వైసిపి భవిష్యత్ ఆధారపడిందా ?
వైసిపి భవిష్యత్తంతా
వాలంటీర్ల మీదే ఆధారపడుందా ? అవుననే అంటున్నారు పార్టీ నేతలు. కార్పొరేషన్ల
ఛైర్మన్లుగా నియమితులైన వారు ఎవరు ఎలా పనిచేసినా నేరుగా ప్రజలపై ప్రభావం చూపేది
తక్కువనే చెప్పాలి. ఇక మంత్రులు ఎంఎల్ఏలు, ఎంపిల పనితీరును జనాలు ఎలాగూ గమనిస్తునే
ఉంటారు. కాబట్టి కొత్తగా నియమితులైన సుమారు 4 లక్షల మంది వాలంటీర్లే పార్టీ
భవిష్యత్తుకు కీలకమవుతారు.
గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల వ్యవస్ధను జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ 50 ఇళ్ళకు ఓ వాలంటీర్ ను నియమించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫథకాల ఫలాలను జనాలకు అందించేందుకు ఏర్పాటు చేసిందే వాలంటీర్ల వ్యవస్ధ.
చంద్రబాబునాయుడు హయాంలో ఇటువంటిదే జన్మభూమి కమిటిలను ఏర్పాటు చేశారు. కానీ ఆచరణలో కమిటిలు విఫలమవ్వటమే కాకుండా ఓ మాఫియా లాగ తయారయ్యాయనే అపప్రదను మూటగట్టుకున్నాయి. జన్మభూమి కమిటి సభ్యులు అరాచకాలకు పాల్పడటంతోనే జనాల్లో టిడిపి అంటేనే ఏహ్యభావం పెరిగిపోయింది. ప్రతీ పనికి, సంక్షేమఫలాలు అందాలన్నా కూడా డబ్బుల కోసం పీడించేవారు. విచిత్రమేమిటంటే డబ్బుల కోసం చివరకు టిడిపి వాళ్ళను కూడా వదల్లేదు.
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటిల బాధ్యతలే ఇపుడు వాలంటీర్లు నిర్వహించాలి. అందుకనే జగన్ ఆలోచనల ప్రకారం జనాలకు అందించాల్సిన ప్రభుత్వ పథకాలను అందించగలిగితేనే ప్రభుత్వంపై జనాల్లో పార్టీ పై సానుకూలత పెరుగుతుంది. అలాగ కాకుండా వాలంటీర్లు కూడా జన్మభూమి కమిటిల బాటలోనే నడిస్తే నష్టం జరిగేది జగన్ కే అన్న విషయం గమనించాలి.
అందుకనే వాలంటీర్లను స్వేచ్చగా వదిలేయకుండా వాళ్ళ పనితీరుపై క్రాస్ చెక్ ఏర్పాటు చేయాలి. అప్పుడే ఎవరైనా తోక జాడించాలని అనుకున్నా జాడించకుండా ఉంటారు. ఇప్పటికే అక్కడకక్కడ వాలంటీర్ల పై ఆరోపణలు మొదలయ్యాయి. మరి నిజంగానే వాలంటీర్లు ఎక్కడైనా తోక జాడిస్తున్నారా ? లేకపోతే ఎల్లోమీడియా దుష్ప్రచారమేనా అన్నది చూడాలి.