కీలక దశకు చేరుకున్న చంద్రయాన్-2

Murali

చంద్రుడిపై కాలు మోపేందుకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా శ్రీహరికోట నుంచి నింగిలోకి ప్రవేశపెట్టిన చంద్రయాన్-2 కీలక ఘట్టానికి చేరువకాబోతోంది. ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 12.45 గంటల నుంచి 1.45 గంటల మధ్య ల్యాండర్ విడిపోనుంది. దీంతో చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ కు మరింత దగ్గరకానుంది. నింగిలోకి దూసుకెళ్లిన అనంతరం 2 కొద్దిరోజుల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించి, ఆగష్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది చంద్రయాన్-2.

 


ఆ తర్వాత నాలుగుసార్లు కక్ష్యను తగ్గించిన ఇస్రో.. ఆదివారం సాయంత్రం 6గంటల 21నిముషాలకు ఐదోసారి కక్ష్యను తగ్గించి విజయవంతంగా ముగించింది. చంద్రయాన్-2ను చంద్రుడి చుట్టూ ఉన్న 119 కిలోమీటర్లు * 127 కిలోమీటర్ల కక్ష్యలోకి చేర్చింది ఇస్రో. ల్యాండర్ చంద్రయాన్-2 వ్యోమనౌక పైభాగంలో ఉంటుంది. ఈ ల్యాండర్ ను క్లాంపులు, ప్రత్యేకమైన బోల్టులతో ఆర్బిటర్ కు అనుసంధానించారు శాస్త్రవేత్తలు. దీంతో.. సోమవారం నిర్దేశిత కక్ష్య పరిధిలోకి ఇది చేరగానే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయేలా ఇస్రో సంకేతాలు పంపిస్తుంది. ఈ విడిపోయే ప్రక్రియ దాదాపు 50 మిల్లీ సెకన్లలోనే పూర్తవుతుంది. మొదటగా ఆర్బిటర్, ల్యాండర్ ను సంధానించిన రెండు బోల్టులు ఊడిపోయి ల్యాండర్ విడిపోతుంది.

 


ఈనెల 3, 4 తేదీల్లో మరోసారి ల్యాండర్ కక్ష్యను తగ్గించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీంతో 35 కిలోమీటర్లు - 97 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరి ఈ నెల 7న తుది అంకానికి శ్రీకారం చుట్టబోతోంది. వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా ల్యాండర్ ను కిందకు దించతారు. అనంతరం 15 నిమిషాల్లోనే ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఓ ప్రాంతంలో దిగుతుంది. దాదాపు నాలుగు గంటల తర్వాత అందులోని రోవర్ బయటకు వస్తుంది. ఈ అరుదైన ఘట్టం కోసం యావద్ భారతం ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ బెంగళూరులోని ఇస్రో ట్రాకింగ్ సెంటర్లో ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: