యాదాద్రిలో శిల్పాల వివాదంపై స్పెషల్ ఆఫీసర్, శిల్పి వివరణ

NAGARJUNA NAKKA

యాదాద్రి ఆలయ అష్టభుజి ప్రాకారంపై కేసీఆర్, టీఆర్ఎస్ గుర్తులను చెక్కించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతుంది. దీంతో టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వివరణ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులను భవిష్యత్ తరాలకు తెలియజేయడానికే.. శిల్పాలు చెక్కామని, ఆ బొమ్మల్లో తప్పేం లేదని స్పష్టంచేసింది. ఒకవేళ అవి తీవ్ర అభ్యంతరం అని ఎవరైనా వస్తే.. వాటిని తొలగించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు వైటీడీఏ కిషన్ రావు. 


యాదాద్రి ఆలయంలో ... సీఎం కేసీఆర్, కారు గుర్తులను చెక్కడంపై వైటీడీఏ స్పందించింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చింది. సమాకాలీన పరిస్థితులను, సంస్కృతి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే శిల్పాలు చెక్కారన్నారు టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ కిషన్ రావు. యాదాద్రి ఆలయాన్ని ప్రభుత్వం ఒక యజ్ఞంలా నిర్మిస్తోందని వివరించారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే శిల్పాలు చెక్కించారనడం పూర్తిగా అవాస్తవమన్నారు కిషన్ రావు. బొమ్మల విషయంలో శిల్పులకు తాము ఎలాంటి ఆదేశాలు, సూచనలు ఇవ్వలేదని, అవి ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కావని స్పష్టం చేశారు. కేసీఆర్ బొమ్మను శిల్పి ఇష్టం మేరకే చెక్కారని, ఆలయంలో కేవలం కారు బొమ్మ ఒక్కటే కాదనీ, కేసీఆర్ కిట్, కారు, ఎడ్లబండి, క్రికెట్, కమలం, సైకిల్  చాలా వాహనాల చిత్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ బొమ్మలు ఉన్న స్ధంబాలను బాహ్యప్రాకారంలోనే ఉన్నాయని, ఆలయం లోపల ఉండే స్థంబాల్లో అన్నీ వైష్ణవ సంప్రదాయం ప్రకారమే చెక్కినట్టు తెలిపారు.


ఆలయంలో సప్త గోపురాలపై మొత్తం 5వేల వరకు చిహ్నాలు ఉన్నాయనీ.. 5వేలమంది శిల్పులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. సీఎంను శిల్పి దేవుడిలా భావించి చెక్కి ఉంటారని ఆనంద్‌ సాయి అన్నారు. ముఖ్యమంత్రి బొమ్మ అభ్యంతరకరం అయితే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. మొత్తం మీద భక్తుల అభిప్రాయలను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామన్న కిషన్ రావు.. శిల్పాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సవరిస్తామని స్పష్టం చేశారు. టెక్నాలజీ అనేది తాత్కాలికమని, ఆలయం మరో రెండు వేల ఏళ్లవరకు ఉంటుందన్నారు. ఈ శిల్పాలు ప్రస్తుత పరిస్థితులను భవిష్యత్ తరాలకు అందిస్తాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: