నాలుగు ముక్కలుగా విడిపోనున్న బెంగళూరు మహానగర్ పాలికె...!

Reddy P Rajasekhar
చాలా రోజుల నుండి బెంగళూరు మహానగర పాలికెను నాలుగు విభాగాలుగా విడదీయాలనే ప్రతిపాదన ఉంది. కానీ వివిధ పార్టీలలో ఉన్నటువంటి నేతలు, కార్పొరేటర్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖించటం జరిగింది. వ్యతిరేఖత కారణంగా ఇన్నిరోజులు ఈ ప్రతిపాదన వాయిదా పడుతూ వస్తోంది. కానీ కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప నాలుగు విభాగాలుగా విభజించటం కొరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. 
 
సీఎం నిర్ణయంతో బెంగళూరు మహనగర పాలికె నాలుగు విభాగాలుగా విడిపోనుంది. సీఎం యడ్యూరప్ప ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు పాలికె ప్రస్తుతం 8 సర్కిళ్లుగా ఉంది. దీనికి ఒకే ఒక్క కమిషనర్ ఉండగా డివిజన్ల వారీగా సహాయక కమిషనర్లు పని చేస్తున్నారు. ఒక కమిషనర్ పాలనా వ్యవహారాలను కొనసాగించటం చాలా కష్టమైన పని. 
 
అందువలన బెంగళూరు పాలికెలోని 8 సర్కిళ్లను నాలుగు విభాగాలుగా విభజించి ఒక్కో విభాగానికి ఒక కమిషనర్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం సిధ్ధరామయ్య బెంగళూరు పాలికెను విభజించాలని కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. కెంపేగౌడ బెంగళూరు నగరానికి ఒకే పాలికె ఉండాలని ముందుచూపుతో పునాది వేశారని గతంలోనే అభ్యంతరాలు ఈ విషయంపై వ్యక్తం అయ్యాయి. 
 
పాలికెలో కన్నడిగుల కంటే ఇతర భాషల వారికే గుర్తింపు ఎక్కువగా ఉంటుందని కన్నడ సంఘాలు తిరగబడటం కూడా జరిగింది. కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ సిధ్ధరామయ్య పాలికె విభజన ప్రస్తావన తీసుకొనిరాలేదు.14 నెలల సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో సిధ్ధరామయ్య విభజన ప్రస్తావనను ఎప్పుడూ తీసుకురాలేదు. సీఎం యడ్యూరప్ప మాత్రం పాలన సజావుగా జరగటం కోసం విభజన మంచిదనే అభిప్రాయం వ్యక్తపరచినట్లు తెలుస్తోంది. నిన్న ఎనిమిది డివిజన్లలోను స్వచ్చతా కార్యక్రమాలు జరగగా స్థానిక కార్పొరేటర్లు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: