ఎస్వీయూ రిజిస్ట్రారు సారూ..? ఆ ఉద్యోగాలు ఎంతకు అమ్మేసుకున్నారు..?
శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాల్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఎస్వీ యూనివర్శిటీలో ఒప్పంద అధ్యాపకులు పని చేస్తున్నారు. అయితే వారికి సరైన అర్హతలు లేవన్న సాకుతో యూనివర్శిటీ పాలక వర్గాలు వారిని తొలగించి మళ్లీ పరీక్ష పెట్టి కొత్తగా టీచింగ్ అసిస్టెంట్లను నియమించుకున్నారు.
అయితే ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్శిటీ ఇంచార్జ్ రిజస్ట్రార్ మొదలు కొని మరికొందరు.. ఈ కొత్త ఉద్యోగాలను అమ్మేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఉద్యోగానికి లక్ష రూపాయలకు పైగా లంచం తీసుకున్నారని.. తొలగించబడిన టీచింగ్ అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర్య ఏజెన్సీతో విచారణ జరిపిస్తే..అసలు నిజాలు తెలుస్తాయని.. లంచగొండి యూనివర్శిటీ అధికారుల ఆట కట్టవుతుందని వారు చెబుతున్నారు.
ఈ టీచింగ్ అసిస్టెంట్ల నియామక ప్రక్రియ అంతా లోపభూయిష్టంగా జరిగిందని.. తమకు కావలసినవారికి పోస్టులు పంచి పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త ఇంచార్జి రిజిస్ట్రార్ వ్యవహార శైలి కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్న వాదనలు కూడా యూనివర్శిటీలో వినిపిస్తున్నాయి. విశ్వ విద్యాలయ అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై ఇంచార్జి రిజిస్ట్రారుకు ఏ మాత్రం పట్టింపులేదని.. ఎంతసేపూ కాసుల కక్కుర్తి తప్ప వేరే ధ్యాస లేదని యూనివర్శిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంచార్జ్ రిజిస్ట్రారు తీరు మారనంత వరకూ ఇలా ఈ శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం పరువు ప్రతిష్టలు మంటకలుస్తూనే ఉంటాయనే వారి సంఖ్య యూనివర్శిటీలో రోజు రోజుకూ పెరిగి పోతోంది. ఇప్పుడు ఈ టీచింగ్ అసిస్టెంట్ల నియామకాల్లో అవకతవకలపై విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ అంశం ఓ రాజకీయ అంశంగా మారి ప్రభుత్వానికి సైతం చెడ్డపేరు తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో.. చూడాలి.