స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమవుతోంది. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియ మొదలు పెట్టనుంది ఏపీ సర్కార్. ముందుగా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త మున్సిపాల్టీలు.. కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది ఏపీ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. సంక్షేమ పథకాల అమలు ప్రారంభించాక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావించింది. ఈ ఎన్నికల్లో తమ సత్తాను మరింత చాటుకోవాలని అధికార పార్టీ చూస్తోంది. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయొచ్చనే వ్యూహంతో ముందుకెళ్తోంది సర్కార్. ఎన్నికల నిర్వహణపై మొన్నటి వరకు ఆచితూచి వ్యవహరించింది ప్రభుత్వం.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందుగా రిజర్వేషన్ల కుదింపు వ్యవహరంపై కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో 18.5 శాతం ఎస్సీలకు.. 8 శాతం ఎస్టీలకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం బీసీ రిజర్వేషన్లల్లో కొద్దిమేర కోత పెట్టాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదు. దీనిపై ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కూడా టేబుల్ ఐటెమ్‌గా ఆర్డినెన్స్ వ్యవహరం వచ్చినా...అది చర్చకు రాలేదని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో 13వేల 053 గ్రామాల్లో.. లక్షా 31వేల 924 వార్డులున్నాయి. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది సర్కార్. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం కోటి 40లక్షల 21వేల 212 మంది పురుషులు..
రెండు కోట్ల 82లక్షల 15వేల 104 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. ఈ ఎలక్టోరల్ జాబితాను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడానికి ఈసీ సిద్దంగా ఉన్నట్టు సమాచారం.
మరోవైపు...పంచాయతీ ఎన్నికలు ముగిశాక.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. ఈలోగా ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా.. కొత్తగా మున్సిపాలిటీలు.. కార్పొరేషన్ల ఏర్పాటుపై మున్సిపల్ శాఖ కొంత మేర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి... స్థానిక సంస్థల ఎన్నికలతో క్షేత్ర స్థాయిలో రాజకీయంగా రచించాల్సిన వ్యూహాలను.. అమలు చేయాల్సిన ప్రణాళికలను అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటున్నాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల్లో చేరికల సందడి కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.