40 సంవత్సరాల రాజకీయ అనుభవం... ఆరుసార్లు ఎమ్మెల్యే.. హోం మంత్రితో పాటు పలు శాఖలు నిర్వహించిన అనుభవం... నవ్యాంధ్రకు తొలి అసెంబ్లీ స్పీకర్.. ఎవరైనా సరై ఐ డోన్ట్ కేర్ అనే తత్వం... ఎన్నో కష్టాలను చిత్తు చేసిన వైనం.. ఇలాంటి నేత ఆత్మహత్య చేసుకునేంత పిరికివారా ? ఖచ్చితంగా కాదు. అలాంటి గట్స్ ఉన్న నేత ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు తలెత్తాయంటే అవి ఎంత క్రిటిక్‌గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇటు వారసుల తీరుతో ఆయన తీవ్రంగా మనస్ధాపం చెందారు. ఐదేళ్లపాటు తన అధికారం అడ్డం పెట్టుకని వారు ఎన్ని అరాచకాలు చేసినా ఆయన కంట్రోల్ చేయలేకపోయారన్నది నిజం. అదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుని ఈ వయస్సులో ఆయనకు తీవ్రమైన అవమానంగా మిగిలిపోయింది. కోడెలను కుమారుడు గత కొన్నేళ్లుగా లెక్క చేయని పరిస్థితులు వచ్చేశాయి. దీనికి తోడు కుమార్తె కూడా సత్తెనపల్లి, నరసారావుపేట రాజకీయాల్లో జోక్యం చేసుకుని తండ్రికి చెడ్డ పేరు తెచ్చింది.
ఇక తాజాగా కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులు కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోనే ఉంటున్నారు. ఆయనపై అసెంబ్లీ లో ఫర్నీచర్ దొంగతనం కేసు నమోదు కావడం, కుమారుడు, కుమార్తెలపై వరసగా కేసులు నమోదవుతుండటంతో కోడెల శివప్రసాద్ రాజకీయంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు.
రాజకీయ చరమాంకంలో ఇలాంటి అవమానాలు కోడెల తట్టుకోలేకపోయారు. ఇక కోడెల కుమారుడి కోసం కొద్ది రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు. ఈ విషయంలోనే కోడెలకు, ఆయన కుమారుడికి నిన్న రాత్రి ఇంట్లోనే తీవ్రమైన వాగ్వివాదం జరిగినట్టుగా మ్యాటర్ బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల మధ్య తలెత్తిన విభేదాలతోనే ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యి ఈ పని చేసినట్టు చెపుతున్నారు.