ప్రత్యర్ధి పార్టీలని విమర్శలతోనే కాదు....లెక్కలతో కూడా ఇబ్బంది పెట్టొచ్చని వైసీపీ నేత బుగ్గన రాజేందర్ నాథ్ రెడ్డి నిరూపించారనే చెప్పొచ్చు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేగా పిఏసి ఛైర్మన్ పదవిని నిర్వహించిన బుగ్గన... అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఇరుకున పెట్టే సత్తా ఉండటంతోనే జగన్... డోన్ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గనకు కీలకమైన ఆర్ధిక శాఖ బాధ్యతలు అప్పగించారు.
అయితే గతంలో పిఏసి ఛైర్మన్ గా చేసిన అనుభవం...ఆర్ధిక విషయాల్లో పట్టు ఉండటంతో బుగ్గన, తొందరగానే శాఖపై పట్టు తెచ్చుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో సీఎం జగన్ తో కలిసి ఆర్ధిక శాఖపై సమీక్షలు చేసి, రాష్ట్ర ఆర్ధిక స్థితిపై అవగాహన పెంచుకున్నారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టి...రాష్ట్రంపై రెండు లక్షల కోట్ల పైగా అప్పు పెట్టిందని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పారు.
ఇక ఆర్ధిక మంత్రిగా అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై ప్రతిపక్ష టీడీపీ చేసిన ప్రతి విమర్శకు అక్కడిక్కడే కౌంటర్ ఇచ్చేశారు. అలాగే తమ మేనిఫెస్టోలోని నవరత్నాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి, వాటికి నిధుల పరంగా ఏ లోటు లేకుండా బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. విద్యా, వైద్యా రంగాలకు కూడా బడ్జెట్ లో పెద్ద పీఠ వేసి నిధులు కేటాయించారు.
అటు అసెంబ్లీలో గానీ, బయట గానీ టీడీపీ చేసిన విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. గత టీడీపీ ప్రభుత్వం ఏ రకంగా ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసిందో ఆధారాలతో సహ బయటపెట్టారు. అయితే అలా చిన్నాభిన్నంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థని బుగ్గన ప్రస్తుతం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పలు విదేశీ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతూ,...రాష్ట్రంలో పెట్టుబడులు కోసం కష్టపడుతున్నారు. మొత్తం మీద బుగ్గన ఆర్ధిక మంత్రిగా జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నాలుగు నెలల పాలన కాలంలోనే బుగ్గన ఆర్ధిక శాఖపై పట్టు తెచ్చుకోగలిగారు.