ప్రజలకు మంచి చేయడానికి అనుభవం అక్కర్లేదు...మంచి మనసు ఉంటే చాలు ఏదైనా సాధ్యమవుతుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరూపిస్తున్నారు. అసలు పాలన వ్యవహారాల్లో ఎలాంటి అనుభవం లేకుండా తొలిసారి సీఎం పీఠం అధిరోహించిన జగన్...నాలుగు నెలల పాలనకాలంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు.
మొదట పింఛన్ల పెంపు దగ్గర నుంచి...తాజాగా ఆటొ, క్యాబ్ డ్రైవర్లకు రూ. 10 వేలు ఆర్ధిక సాయం చేసే పథకం వరకు జగన్ ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు. వీటితో పాటు గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులని కూడా జగన్ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ ఒక్కో పని వెనుక ఒక్కో స్కెచ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పని వల్ల ప్రజలకు మేలు జరగడంతో పాటు..తనకు మంచి పేరు వస్తుంది.
ఒక్కో పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల ఆయా వర్గాల ప్రజల మద్ధతు కూడగట్టుకుంటున్నారు. పింఛన్ల ద్వారా అవ్వా,తాతలు, మద్యపాన నిషేధం ద్వారా అక్కా-చెల్లెళ్ల మద్ధతు దక్కించుకున్నారు. అటు ఎస్సీ,ఎస్టీ, బీసీ, కాపు కమిషన్ల ద్వారా రుణాలు ఇస్తూ...ఆయా వర్గాల్లో పాజిటివ్ అయ్యారు. అదేవిధంగా గత సీఎం మాదిరిగా ఆడంబరాలకు పోకుండా ఖర్చు తగ్గిస్తూ..పొదుపు సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారు.
ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధికారం చేపట్టిన నాలుగు నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు పెద్దన్నగా నిలిచారు. గ్రామ వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థ పేరిట ఉద్యోగాలు కల్పించి, యువతలో ఫాలోయింగ్ పెంచుకున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్లలో సగం పదవులు మహిళలతోనే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేలు సాయం చేసే పథకాన్ని తీసుకొచ్చి...ఆటో,క్యాబ్ డ్రైవర్ల జీవితల్లో వెలుగునింపారు. వీరు కూడా జగన్ కు జై కొడుతున్నారు. ఇవే గాక ఈ నాలుగు నెలల్లో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తానికి జగన్ అదిరిపోయే స్కెచ్ లు వేస్తూ...ప్రజలకు మంచి చేస్తూ ఆరు నెలల్లోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకోవాలనే కోరికని నెరవేర్చుకునే దిశగా వెళుతున్నారు.