ఆర్టీసీపై సీఎం తీవ్ర ఆగ్రహం.. డ్యూటీకి రాకపోతే పీకేయండి..

Chakravarthi Kalyan

సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి రాగానే ఆర్టీసీ సమ్మెపై కార్మికులతో చర్చిస్తున్న త్రిసభ్య కమిటీని పిలిపించుకుని ఆయన మాట్లాడారు. కార్మికులతో జరిగిన చర్చల వివరాలను కేసీఆర్ కు వారు వివరించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ పై లిఖితి పూర్వక హామీ కోరినట్టు వివరించారు.


సమ్మె చేస్తామంటున్న ఆర్టీసీ కార్మికుల తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక కార్మికులతో చర్చించ కూడదని.. ప్రభుత్వం పవర్ ఏంటో చూపించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సమ్మెపై ఉక్కుపాదం మోపైనా సరే.. వెనక్కు తగ్గకూడదని కేసీఆర్ నిర్ణయించారు. అందుకే సమ్మెపట్ల కఠిన వైఖరి అవలంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.


శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.


విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ కూడా రద్దయిపోయింది.


ప్రభుత్వం హుటాహటిన ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా సందీప్ సుల్తానియాను నియమించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపాడాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: