మెఘా ఛైర్మన్ ఇంటిపై ఐటి దాడులు..పోలవరమే కారణమా ?
ప్రాజెక్టుల
నిర్మాణాల్లో సంచలనాలు సృష్టిస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్
లిమిటెడ్ (ఎంఇఐఎల్)పై ఐటి దాడులు చేయటం
సంచలనంగా మారింది. మేఘా కంపెనీకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టు దక్కిన
వెంటనే ఐటి దాడులు జరగటం సంచలనంగా మారింది. మెఘా కంపెనీ దశాబ్దాలుగా నిర్మాణ
రంగంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ఐటి దాడులు జరగలేదని అంటున్నారు.
రివర్స్ టెండరింగ్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులను నవయుగ కంపెనీకి క్యాన్సిల్ చేసిన విషయం అందరకీ తెలిసిందే. రివర్స్ టెండర్లలో మెఘా కంపెనీకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు హైడల్ ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టు కూడా దక్కింది. నిజానికి నవయుగకు క్యాన్సిల్ చేసి మెఘాకు కాంట్రాక్టు పనులను కట్టబెట్టటం చంద్రబాబునాయుడుతో పాటు బిజెపిలోని చాలామంది నేతలకు ఇష్టం లేదు.
ఇదే విషయమై చంద్రబాబు, బిజెపి నేతలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పటి నుండి జగన్ మీదే కాకుండా మెఘా కంపెనీ మీద కూడా కొందరు నేతలు చాలా గుర్రుగా ఉన్నారు. రివర్స్ టెండర్లలో నవయుగ కంపెనీ చేస్తున్న మొత్తం కన్నా మెఘా సుమారు 730 కోట్ల తక్కువకే టెండర్ వేయటంతో ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. అంటే జగన్ సక్సెస్ అయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
తొందరలోనే మెఘా కంపెనీ పోలవరం పనులను ప్రారంభించేందుకు రంగం రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలోనే ఒకేసారి మెఘా కంపెనీ ఛైర్మన్ కృష్ణారెడ్డి ఇంటితో పాటు కార్యాలయాలపైన కూడా ఐటి దాడులు జరగటం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా మెఘా కంపెనీకి ఉన్న 30 కార్యాలయాలపై దాడులు జరిగాయి. అన్నీ కార్యాలయాల్లోను ఐటి అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
తమ సోదాల్లో అధికారులు కొన్ని కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలవరం కాంట్రాక్టు పనుల ప్రారంభానికి ముందు ఐటి దాడులు జరగటం యాధృచ్చికం మాత్రం కాదనే అనిపిస్తోంది.