తొలిసారి అధికారంలోకి వచ్చినా... సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మన్ననలని పొందుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్ల.....తెలంగాణ సీఎం కేసీఆర్కు లేనిపోని తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఇటీవల జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తెలంగాణలోని ప్రతిపక్షాలు పొగడ్తల వర్షం కురిపిస్తూ...కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కూడా ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగుల కింద తీసుకుని, వారి పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇదే నిర్ణయం కేసీఆర్ కొంపముంచేలా కనిపిస్తోంది. గత వారం రోజులు నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పలు డిమాండ్లని నెరవేర్చాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం సమ్మెపై ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, విధులకు హాజరుకాని వారు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని ప్రకటించేశారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పక్కనఉన్న ఏపీ సీఎంని చూసి బుద్ధి తెచ్చుకుని డిమాండ్లని నెరవేర్చాలని కోరుతున్నారు.
దీనిపై సమ్మెని మరింత ఉదృతం చేసి...తెలంగాణ రాష్ట్ర బంద్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే జగన్ ఆర్టీసీకి సంబంధించి మరో నిర్ణయం తీసుకుని..కేసీఆర్ కు మరో తలనొప్పి తెచ్చిపెట్టారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియని వేగవంతం చేస్తూ… ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మొత్తం 9 అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై కూడా కమిటీ అవసరమైన సూచనలు చేయనుంది.
ఇందులో శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలపై, రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు,వైద్య సదుపాయలపై కమిటీ పరిశీలన చేయనుంది. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ఉన్న ఆర్ధిక,న్యాయపరమైన అంశాలపై కూడా నివేదిక తయారుచేసి, అక్టోబర్ నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఓ వైపు తెలంగాణలో సమ్మె జరుగుతుంటే..మరోవైపు జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయడం కేసీఆర్ కు కొత్త ఇబ్బందులు తెచ్చే పరిణామమే అని చెప్పాలి.