కల్తీ.. కల్తీ.. కల్తీ.. మార్కెట్లో ఏది కొనాలన్నా.. ఏది తినాలన్నా.. కల్తీయే. లాభార్జనే ధ్యేయంగా వ్యాపారస్తులు కల్తీ వస్తువులను విక్రయిస్తున్నారు. కల్తీకి కాదు ఏది అనర్హం అన్న రీతిలో వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో కల్తీ పాలు, ప్లాస్టిక్ పాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ప్లాస్టిక్ గుడ్లు, ప్లాస్టిక్ బియ్యం ఇప్పటి వరకు చూశాము. వీటి ద్వారా జరిగే అనర్థాలు విన్నాం. ఈ లిస్టులోకి మరో కొత్తది చేరింది. అదే ప్లాస్టిక్ పాలు.. చూడటానికి అచ్చం పాలలాగే ఉన్నప్పటికి పాలు కాదు. హైదరాబాద్‌లో బయటపడ్డ ప్లాస్టిక్ పాల వ్యవహారం.. సంచలనం రేపుతోంది. పాలు పగిలినప్పుడు మాత్రమే అవి కల్తీ పాలన్న వ్యవహారం తెలుస్తుంది. సహజంగా పాలు కాచినప్పుడు పాల పైన మీగడ వస్తుంది. దాన్ని ముట్టుకుంటే మృదువుగా ఉంటుంది. ఒకవేళ తీద్దామని ప్రయత్నిస్తే పడిపోతుంది. కాని ప్లాస్టిక్ పాలలో మాత్రం పైన వచ్చి మీగడ లాంటి పదార్థం సాగుతుంటుంది.
బాచుపల్లి.. ప్రగతినగర్‌కు చెందిన అప్పారావు.. ఓ షాపులో పాలు కొనుగోలు చేశాడు. వాటిని మరగబెట్టగా... మీగడ చేరింది. దాన్ని పట్టుకొని చూడగా ప్లాస్టిక్‌లాగా సాగుతూ కన్పించింది. షాపు యజమానిని నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. ప్లాస్టిక్ పాల బాగోతం వెలుగులోకి వచ్చింది. పాలు ఒక్కటే కాదు, పెరుగు కూడా అదే మాదిరిగా ఉంటుందని స్థానిక మహిళలు అంటున్నారు. తమకు కల్తీ వ్యవహారం తెలియకపోవడంతో ఇవే పాలను తాగుతున్నామని చెబుతున్నారు. కల్తీ పాల వ్యవహారంపై ఆ షాపు యజమాని మాత్రం అలాంటిదేమి లేదని అంటున్నాడు. అనుమానం ఉంటే ల్యాబ్‌కు పంపించి పరీక్షలు జరపాలని కోరుతున్నాడు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించామనీ, పాల శ్యాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.