ఆర్టీసీ సమ్మె, చర్చలు.. ఇప్పుడు ఆ ఎంపీయే కీలకం..?
దాదాపు 10 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె జోరుగా సాగుతోంది. మొదట్లో మెల్లగా మొదలైన సమ్మె ఆ తర్వాత జోరందుకుంది. దీనికితోడు సర్కారు వైఖరితో మనస్తాపం చెందిన కొందరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో సమ్మెతో ఉద్రిక్తత, ఉత్కంఠ చోటు చేసుకుంటున్నాయి.
ఆర్టీసీ సమ్మెను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన ప్రభుత్వం.. సమ్మెకు దిగిన తొలిరోజే కార్మికులపై వేటు వేసింది. ఆ రోజు డ్యూటీకి రానివారందరూ ఉద్యోగాలు కోల్పోయినట్టే అంటూ ప్రకటనలు ఇచ్చింది. అంతే కాదు.. ఇక వారికీ సంస్థకూ సంబంధం లేదని.. వారిని చర్చలకు పిలిచేది లేదని ఖరాఖండీగా చెప్పింది.
కానీ రోజురోజుకూ సమ్మె ఉధృతం కావడం.. ఆర్టీసీ కార్మికులకు ఇతర ఉద్యోగ సంఘాలు మద్దతు తెలపడంతో ప్రభుత్వం కాస్త ఇరకాటంలో పడింది. అందుకే మధ్యేమార్గంగా తన ఎంపీ కేశవరావును ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టిన పది రోజులవరకూ కూడా చర్చల ఊసెత్తని సర్కారు.. చివరకు కేశవరావు ద్వారా చర్చల ప్రతిపాదన తెచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని టీఆర్ ఎస్ ఎంపీ కేశవరావు ప్రకటన విడుదల చేయడంతో చర్చల విషయం ప్రస్తావనకు వచ్చింది. కేసీఆర్ అనుమతి లేకుండా కేకే ఇలాంటి ప్రకటన విడుదల చేసే అవకాశం లేదు. అంటే ప్రభుత్వం కేకే ద్వారా చర్చల ప్రక్రియ కొనసాగించాలని భావిస్తుండొచ్చు.
అదే సమయంలో కార్మికులు కూడా కేకే ప్రతిపాదనను ఆహ్వానించారు. కేకే మధ్యవర్తిగా ఉండే తాము చర్చలకు సిద్ధమని ప్రకటించడం ద్వారా ఇప్పుడు అందరి దృష్టీ కేకే పై కేంద్రీకృతమై ఉంది. మరి ఆయన చర్చలను ఎలా ముందుకు తీసుకెళ్తారు.. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో..