గవర్నర్ గిరీ అంటే ఏమిటో చూపిస్తున్నారు తమిళసై! ప్రగతి భవన్ గడపదాటని కేసీఆర్ కు చుక్కలే ఇక!

పదవి ఏదైనా అర్హతలేవైనా ఎం-పవర్మెంట్ అనేదొకటుంది. ప్రజాసేవలో తరించాలంటే ముఖ్యమంత్రే కానవసరంలేదు. ఒక పదవిని అలకరించిన  వ్యక్తి తనకున్న ఎంపవర్మెంట్ పగ్గాలు విదిల్చితే చాలు – నిద్రావస్థలో ఉన్న ఇరుగు పొరుగు వారిలో కదలిక రాక తప్పదు. ఇప్పుడు తెలంగాణ గవర్నరు తమిళసై తన సేవాదృక్పథంతో పెట్టే పరుగులు ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావులో కంపం పుడుతుంది.   ఆమె తెలంగాణ గవర్నరుగా పదవి చేపట్టి స్వల్ప కాలమే అయినా – తెలంగాణా ప్రజల్లో చాలా చురుగ్గా మమేకమవబోతున్నారని అభిఙ్జవర్గాల బోగట్టా.


ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్షించారు. అంతే కాదు ఆర్టీసీ సమ్మె విషయం లోనూ రవాణా శాఖ మంత్రి, అధికారుల ను పిలిచి పరిస్థితులు తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ సూచనలిచ్చారు అందులో ఆదేశం కూడా ఇమిడి ఉన్న దాఖలాలు వినిపిస్తున్నాయి. సమస్యలపై ప్రభుత్వ నాయకత్వం, కంటే వేగంగా స్పందిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చే వారిని నిరాశ పరచడం లేదు, ధైర్యం చెపుతూ  పంపుతున్నారు. బహుశ ప్రజా దర్భార్ నిర్వహించ బోతున్నట్లు తెలుస్తుంది.


తండాల్లో పల్లె నిద్రకు సిద్ధమౌతున్నారు. తమిళసై ఇంత చురుగ్గా వ్యవహారాలు చక్కబెట్టేందుకు కారణమేంటి? తెలంగాణ గవర్నర్ తమిళసై దూకుడులో తన స్వంత ముద్ర వేస్తున్నారు. రాజ్ భవన్ లో విశ్రాంతి తీసుకోవడానికి గవర్నర్ గా రాలేదని చాలా స్వల్ప కాలం లోనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. గవర్నర్ వచ్చీ రాగానే తెలంగాణా పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన సాధించారని తెలుస్తుంది. ఆ తర్వాత మెల్ల మెల్లగా తన దైన శైలిలో రాష్ట్ర ప్రజల అవసరాలపై దృష్టి కేంద్రీకరించారు.


రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటికీ గవర్నర్ ఛాన్సలర్ గా ఉంటారు అందుకే ముందు యూనివర్సిటీలపై దృష్టి పెట్టారు. తొలుత యూవర్సిటీల స్థితిగతులపై సమీక్ష చేశారు, కీలకమైన సూచనలు చేశారు. ఇప్పుడామె చేపట్టనున్న మరో కార్యక్రమం సహజంగా ప్రజల వద్దకు వెళ్ళని అసలు ప్రగతి భవన్ గడపదాటి సచివాలయం వైపే వెళ్ళని ముఖ్యమంత్రి కేసీఆర్ నే కాదు మొత్తం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోతోంది. తెలంగాణా గిరిజన గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలని సంకల్పించారు  దీంతో అక్కడి సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలు అన్నీ బయటపడతాయి ప్రభుత్వ నిర్వాకం మొత్తం ప్రజలకు తెలుస్తుంది. 


గిరిజన సంక్షేమశాఖతో చేపట్టిన సమీక్ష కార్యక్రమంలో గవర్నరు ఈ మేరకు తన ఆకాంక్షను బయటపెట్టారు. తాను వైద్యాధికారిగా ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లోని మారుమూల గిరిజన గ్రామాల్లో వారితో పాటే ఉన్నానని, అక్కడే ఉంటూ వారికి వైద్య సేవలందించానని చెప్పారు. గిరిజనుల మధ్యే ఉంటూ వారి సంస్కృతి సమస్యలను అర్థం చేసుకున్న ప్పుడే సరైన పరిష్కారాలు అందించగలమని ఆమె అన్నారు.


నిజానికి గవర్నరు వివిధ శాఖలతో సమీక్షలు చేపట్టినప్పుడే ప్రభుత్వానికి సెగ తగిలింది. ఇప్పుడామె మరింత ముందుకెళ్లి ప్రజల మధ్యకు వెళ్తాలని నిశ్చయించు కోవటం  తో ముఖ్యమంత్రి, మంత్రిమండలి సిగ్గుపడాల్సిన సమయం ఆసన్నమైనట్లే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజల్లోకి వెళ్లడం మాట దేవుడెరుగు  సెక్రటేరియట్ కు కూడా రాకుండా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో సువర్ణాక్షరాల్లో లిఖించబడ్డ చరిత్ర ఖ్యాతి ఆయన స్వంతం. 


“యథారాజా తథా ప్రజ” అన్నట్లుగా ఆయన, మంత్రులూ దాదాపు ప్రజలను  మర్చిపోయారు. అలాంటి సమయంలో గవర్నరు ప్రజల్లోకి వెళ్తానంటుండడం సీఎం ను మంత్రులను ఇబ్బంది పెడుతోంది. మరోవైపు గవర్నరు సీఎం ను నామ మాత్రం చేసి పాలన సాగిస్తారా! అన్నంత వేగంగా ఆమె అడుగులేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: