కేంద్ర ప్రభుత్వం భారతీయ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారతీయ రైళ్లలో ఉచిత వైఫై సర్వీసు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. 2023 సంవత్సరంలోపు అన్ని భారతీయ రైళ్లలో ఉచిత వైఫై సర్వీసు అందుబాటులోకి వస్తుందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం పీయూష్ గోయల్ స్వీడన్ పర్యటనలో ఉన్నారు.
ప్రస్తుతం దేశంలోని 5,150 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని పీయూష్ గోయల్ అన్నారు. 2020 సంవత్సరం చివరినాటికి 6,500 స్టేషన్ లకు వైఫై సౌకర్యాన్ని విస్తరిస్తామని మంత్రి తెలిపారు. రైళ్లలో వైఫై సౌకర్యం కల్పించటం గురించి మంత్రి మాట్లాడుతూ రైళ్లలో వైఫై సేవలు చాలా సంక్లిష్టమైన సబ్జెక్ట్ అని అన్నారు. విదేశీ పెట్టుబడులు, సాంకేతికత రైళ్లలో వైఫై పరికరాలు ఏర్పాటు చేయటానికి కావాలని అన్నారు.
కొత్తగా టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. నడుస్తున్న రైళ్లలో ప్రయాణికులకు వైఫై సేవలను అందించటం కొరకు చాలా పెట్టుబడి అవసరం అవుతుందని మంత్రి చెప్పారు. సిగ్నలింగ్ సిస్టమ్ ఇంకా మెరుగ్గా వైఫై ఫెసిలిటీ ద్వారా పని చేస్తుందని మంత్రి అన్నారు. రాబోయే నాలుగు, నాలుగున్నర సంవత్సరాలలో రైళ్లలో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు.
రైళ్లలో వైఫై సౌకర్యం కల్పిస్తే ప్రయాణికుల భద్రతకు కూడా చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ప్రతి ట్రైన్ కంపార్ట్మెంట్ లో సీసీటీవీలను అమర్చి ప్రయాణికులకు భద్రత కల్పిస్తామని మంత్రి చెప్పారు. సీసీటీవీల నుండి పోలీస్ స్టేషన్ కు నేరుగా లైవ్ ఫీడ్ వెళ్లేలా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని తెలుస్తోంది. ప్రభుత్వం నడుస్తున్న రైళ్లలో వైఫై సౌకర్యం కల్పిస్తే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.