తెలుగు రాష్ట్రాలకు "క్యార్రా" తుఫాన్ గండం

NAGARJUNA NAKKA

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ గండం పొంచి ఉంది. అరేబియాలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్రమైన తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి ఒమన్ నుంచి భారతదేశం దిశగా పయనిస్తోంది. ఈ తుపానుకు 'క్యార్రా' అని నామకరణం చేశారు. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైకు దక్షిణాన 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్.. రత్నగిరికి పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో భీకర రూపం దాల్చనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.


'క్యార్రా' తుఫాన్ ప్రభావం వల్ల రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణాలో ఆదివారం నుంచే పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని..ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. 


ఇదిలా ఉండగా ఈ తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో గోవా  ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేస్తూ రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించింది. వాతావరణశాఖ హెచ్చరికలతో దక్షిణాది ప్రజలు ఒకింత ఆందోళన చెందుతున్నారు. క్యార్రా తుఫాన్ ఎలాంటి ఉపద్రవాన్ని తీసుకొస్తుందోనని వణికిపోతున్నారు. ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న దక్షిణాది ప్రజలు మరో తుఫాన్ గండం హెచ్చరికలతో తెగ భయపడిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: