హీటెక్కిస్తున్న ’మహా’ రాజకీయాలు..సేన, ఎన్సీపీ భేటి
మహారాష్ట్ర
రాజకీయాలు రోజుకో రకంగా మలుపులు తిరుగుతూ హీటెక్కించేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు
వెలువడి ఐదురోజులైనా ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవటమే ఇందుకు నిదర్శనం. శివసేన
కీలక నేత సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటి కావటం సంచలనంగా మారింది. సిఎం
పీఠంపై ఏర్పడిన పీటముడి వల్ల శివసేన ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో జట్టుకట్టే విషయం
ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మిత్రపక్షాలు బిజెపి-శివసేన మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన వల్లే రాజకీయీలు బాగా వేడిక్కిపోతున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవావ్ తో శివసేన కీలక నేత, ఎంపి సంజయ్ రౌత్ సమావేశమవ్వటం కీలకంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి 105 సీట్లొచ్చాయి. శివసేన 56 నియోజకవర్గాల్లో గెలిచింది.
లెక్కప్రకారమైతే ఎక్కువ సీట్లు గెలిచిన బిజెపికే ముఖ్యమంత్రి సీటు దక్కాలి. కానీ ఎన్నికల ముందు రెండు పార్టీల మధ్య 50: 50 రేషియోలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే ఒప్పందం కుదిరిందట. ఆ ఒప్పందాన్ని బయటకు తీసి ముందుగా తమకే సిఎం పదవి దక్కాలని, మంత్రివర్గంలో కూడా సగం శాఖలు తమకు దక్కాలన్నది శివసేన వాదన మొదలుపెట్టింది.
అసలు అటువంటి ఒప్పందమే లేదు కాబట్టి సిఎం పీఠంతో పాటు కీలక శాఖలన్నీ తమకే దక్కుతాయని బిజెపి వాదిస్తోంది. దాంతో రెండు పార్టీల మధ్య వివాదం పెరిగిపోయింది. అందుకనే ఇప్పటి వరకూ ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఈ వివాదం ఇలాగుండగానే శివసేన ఎంపి రౌత్ ఎన్సీపీ అధ్యక్షుడు పవార్ తో గురువారం భేటి అవ్వటం సంచలనంగా మారింది.
ఎన్సీపీ-కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది శివసేన తాజా ఆలోచనగా తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరికైనా 145 సీట్లుండాలి. శివసేన+ఎన్సీపి+కాంగ్రెస్ కలిస్తే బలం సరిపోతుంది. కానీ ఎంతకాలం ఉంటుందన్నదే అనుమానం. అలాగే బిజెపి+శివసేన+స్వతంత్రులు కలిసినా ఏర్పడే ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ఎవరు చెప్పలేకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.