మహారాష్ట్రలో కాంగ్రెస్ కింగ్ మేకర్ అవుతుందా?
మహారాష్ట్రలో కొత్త పొత్తు పొడిచిందా..? శివసేన—బీజేపీ మధ్య దూరం పెరుగుతుందా..? అనూహ్యంగా కాంగ్రెస్ కింగ్ మేకర్ కానుందా..? ఈ సస్పెన్స్‌కు తెరపడేదెప్పుడు..? రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వచ్చి వారం గడిచింది. హర్యానాలో బీజేపీ—జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ అదేరోజు ఫలితాలు వెలుబడ్డ మహారాష్ట్రలో మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. శివసేన, బీజేపీ పంతాలకు పోవడంతో...ఇష్యూ డైలీ సీరియల్లా సాగుతోంది. రేపోమాపో క్లారిటీ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. శివసేన కొత్తదారులు వెతుకుతోంది. ఒకవేళ బీజేపీతో దోస్తీ కటీఫ్ అయితే... ఏం చేయాలన్నదానిపై ఫోకస్ పెట్టింది. ఎన్సీపీతో చర్చలు కూడా ప్రారంభించింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్...శరద్ పవర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదని, క్యాజువల్ మీట్ అంటూ చెప్పుకొచ్చారు.
అంతకుముందు శివసేన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే. శివ సైనికుడే మహారాష్ట్రకు కాబోయే సీఎం అవుతారన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు వచ్చిన తొందరేమీ లేదన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూడా తమతో టచ్‌లో ఉన్నాయని బాంబ్ పేల్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే.. చర్చలే జరగబోవని తేల్చి చెప్పారు ఉద్దవ్ ఠాక్రే. ఆదిత్య థాక్రే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌తో మాట్లాడలేదన్నారు ఆదిత్య థాక్రే. కేవలం మహారాష్ట్ర రైతుల కష్టాలపై మాట్లాడినట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
ఇటు బీజేపీ కూడా మెట్టుదిగట్లేదు. మరో ఐదేళ్లు తానే మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పేశారు. ఇప్పటికే ఫడ్నవీస్‌ను ఎల్పీనేతగా ఎన్నుకున్నారు. తెగేదాక లాగాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు కన్పిస్తోంది. ఒకవేళ శివసేన బీజేపీతో కటీఫ్ చేసుకొని... ఎన్సీపీతో కలిస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఐతే కాంగ్రెస్ మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం. ఒకవేళ బయటి నుంచి మద్ధతు ఇస్తే అవకాశముంటుంది.. అదే జరిగితే.. మహారాష్ట్ర.. కాంగ్రెస్ చేతుల్లో ఉన్నట్లే.