నలుగురు భర్తల బలవన్మరణం.. రెండు వారాల వ్యవధిలోనే..!

NAGARJUNA NAKKA

భార్య పుట్టింటికి వెళ్లి సమయానికి తిరిగి రాలేదని ఒకరు..!  పెళ్లాం విడిచి వెళ్లిపోయిందని ఇంకొకరు..!  అర్ధాంగి లేని జీవితాన్ని ఊహించుకోలేక మరొకరు!... ఇలా  తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల నలుగురు భర్తలు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 


చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద శిక్షలు. మాట్లాడుకుని పరిష్కరించుకునే సమస్యలకే నిండు జీవితాలు బలి...!  తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన నాలుగు ఘటనలు పరిశీలిస్తే ఇదే తేలింది. కాకినాడ, మండపేట, రాయవరం పోలీస్ స్టేషన్ ల  పరిధిలో రెండు వారాల వ్యవధిలో  నలుగురు  భర్తలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత నెల 13న రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో శ్రీనివాస్ అనే వ్యక్తి  ఉరేసుకొని చనిపోయాడు. మద్యానికి బానిసైన కారణంగా భార్య, కుమారుడు కొద్ది రోజుల క్రితమే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. 


మండపేట మండలంలోని మారేడుబాకలో ఇదే తరహాలో మరో భర్త సూసైడ్ చేసుకున్నాడు. భార్య తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందన్న మనస్థాపంతో రెండ్రోజుల క్రితం ఉరి వేసుకుని చనిపోయాడు. పుట్టింటి నుంచి భార్య రాలేదన్న మనస్తాపంతో కాకినాడలోని ఎస్ అచ్యుతాపురంలో ఓ యువకుడు  ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.  వీరబాబు సత్యవేణికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులకే సత్యవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి రమ్మని ఎన్నిసార్లు భర్త వెళ్లి బతిమాలినా వినలేదు. ఇటీవలే అత్తింటివారు వీరబాబుపై దాడి చేశారు. దీంతో తీవ్ర ఆవేదనతో అతడు బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. 


మరోవైపు ఈనెల 23న మండపేటలో గుండెలు పిండేసే విషాద సంఘటన జరిగింది. ప్రాణానికి ప్రాణంగా భావించిన తన భార్య డెంగ్యూ వ్యాధితో మృతి చెందడంతో ...కుమిలిపోయిన భర్త,...  కుమార్తె ఊపిరి తీసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యలు అన్నీ వైవాహిక జీవితంలో ఎడబాటు,  ఒంటరి జీవితాన్ని తట్టుకోలేక  జరిగినవే. పెళ్లి సమయంలో వధూవరుల  జాతకాలు చూస్తున్నారే తప్ప,  మనస్తత్వాలు చూడడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయన్నది మానసిక నిపుణుల మాట. ఇలా  రెండు వారాల వ్యవధిలో నలుగురు భర్తలు బలవన్మరణాలకు పాల్పడడం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య, భర్తల మధ్య కలహాలు... మానసిక వేదనల గురించి... కుటుంబ పెద్దలకు తెలిసి కూడా పట్టించుకోకపోవటం మరో కారణమవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: