హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలు చూశాకనైనా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కళ్లు తెరుచుకోకపోతే ఎలా అని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్, తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రుసరుసలాడారు. వారు ఆదివారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. లగడపాటి వ్యాఖ్యల పుణ్యంగానే పరకాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమ్మారావు ఐదో స్థానంలోకి వెళ్లాడని జీవన్ మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో జగన్ వర్గీయులకు ఓట్లేస్తే తెలంగాణను బలపర్చినట్లేనని లగడపాటి ప్రచారం చేశారనీ, కానీ సీమాంధ్ర ప్రజలు ఆయన మాటలను పట్టించుకోలేదన్నారు. లగడపాటి ప్రచారాన్ని సీమాంధ్ర ప్రజలు తిరస్కరించాక కూడా లగడపాటి తెలంగాణపై అవాక్కులు, చవాక్కులు పేలుస్తున్నాడనీ టీఆర్ఎస్ నేత వినోద్ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావల్ని సీమాంధ్ర ప్రజలు గౌరవిస్తున్నారనీ, లగడపాటి ఒక్కడే వ్యతిరేకిస్తున్నాడనీ, ఫలితాలు చూసిన తరువాత కూడా లగడపాటి తన పద్దతిని మార్చుకోకుంటే ఎలా అని వారు ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ పరకాల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ఆర్, టీడీపీ, బీజేపీ పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా ప్రచారం చేశారన్నారు. కొండా సురేఖకు మద్దతుగా ప్రచారానికి వచ్చిన విజయమ్మకూడా తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామనీ చెప్పారనీ, దీనితో పరకాలలో వైఎస్ఆర్ పార్టీని ప్రజలు ఆదరించి రెండో స్థానంలోకి తీసుకెళ్లారనీ జీవన్ గుర్తు చేశారు. లగడపాటి వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు. సీమాంధ్రలో జగన్ దూకుడును ఎదుర్కునే సత్తా లగడపాటికి వుండవచ్చు, తెలంగాణలో మాత్రం తెలంగాణ సెంటిమెంటుకు వ్యతిరేకంగా తాము పోయే దమ్ము,ధైర్యం లేదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా లగడపాటి మాట్లాడినన్ని రోజులు తెలంగాణలో కాంగ్రెస్కు నష్టమే తప్ప రవ్వంత కూడా లాభం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడాలన్నా, పూర్వ వైభవం రావాలన్నా తెలంగాణ ఏర్పాటే ఏకైక మార్గమన్నారు. దీని కోసం కేంద్ర మంత్రి చిదంబరం మరోమారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలనీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సీమాంధ్రలోని రాజగోపాల్ వంటి నేతలే కారకులని ఆయన అన్నారు. వీరి వల్ల కాంగ్రెస్ బలహీనపడుతోందన్నారు. అధిష్టానం గ్రహించాలని జీవన్ రెడ్డి కోరారు.
మరింత సమాచారం తెలుసుకోండి: