ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపాటు...?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీల కాలపరిమితి ముగిసి ఇప్పటికే 15నెలలైంది. ఉమ్మడి హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. నిన్న హైకోర్టు ధర్మాసనం విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ శ్యాంప్రసాద్ తో కూడిన ధర్మాసనం ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కానీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉందని వ్యాఖ్యలు చేసింది. 
 
ప్రభుత్వం అఫిడవిట్ లో కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో స్పష్టమైన కారణాలను తెలియజేయలేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘం తీరుపై కూడా అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల పట్ల ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తుంటే తెలుస్తోందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకుంటామని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 
 
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తుంటే తమ అధికారాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదో అర్థం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన ఉత్తరప్రత్యుత్తారాల్ని హైకోర్టు ముందు ఉంచాలని ఎన్నికల సంఘం కార్యదర్శిని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీకి హైకోర్టు విచారణను వాయిదా వేసింది. న్యాయవాది తాండవ యోగేష్ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని గతంలో పిల్ దాఖలు చేశాడు. 
 
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ తుఫాన్, అధిక వర్షాలు, ఎన్నికల కోడ్, ఉద్యోగాల భర్తీ మొదలైన కారణాల వలన ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ధర్మాసానానికి వివరించారు. 2020 సంవత్సరం మార్చినాటికి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తుందని శ్రీరామ్ హైకోర్టు ధర్మాసనానికి చెప్పాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: