జగన్ సర్కారు పై దమ్మున్న పత్రిక.. కామెడీ స్టోరీ..?
ఏపీలో ఇప్పుడు ఇంగ్లీషు, ఇసుక ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా జగన్ సర్కారు వచ్చే ఏడాది నుంచి ఆరోతరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో భాషా ప్రేమికులు ఒక్కసారిగా గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. ఇంతకీ ఈ భాషా ప్రేమికులు ఎవరో కాదు.. ఎల్లోమీడియాగా పేరుబడిన తెలుగు మీడియా వర్గాలు.
కానీ.. ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ వెనక్కు తగ్గేది లేదని ప్రకటించడంతో ఇప్పుడు కొత్త కొత్త కథనాలు వండివారుస్తున్నారు. దమ్మున్న పత్రికగా చెప్పుకునే ఓ పత్రిక అయితే ఏకంగా తన కల్పనాశక్తిని విపరీతంగా వాడేసింది. తాజాగా ఈ వ్యవహారం పార్లమెంట్‌కు చేరిందట. హఠాత్తుగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయట.
జగన్ నిర్ణయం ఒక్క ఏపీలోనే కాదు.. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఏపీ ఇంగ్లీష్ మీడియం వివాదం కలకలం రేపుతోందట. ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మాతృభాషను కాదని ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురాలేదని భాషా నిపుణులు చెబుతున్నారట. ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై ఇంత పట్టుదలగా ఉండటానికి కారణం ఏంటని వారు చర్చించుకుంటున్నారట.
అంతేనా.. ఈ ఇంగ్లీషు మీడియం వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అని జాతీయ వర్గాలు ఆరా తీస్తున్నాయట. ఈ క్రమంలో కేశినేని నాని ప్రస్తావించిన తెలుగు భాష, ఇంగ్లీష్ మీడియం అంశాలపై పార్లమెంట్ స్థాయిలో చర్చ సాగుతోందట. రాజకీయ వ్యూహాల కోసమో, మరే ఇతర కారణాలతోనో.. సొంతభాషపై కత్తి కట్టిన్నట్లు వ్యవహరించడమేని ప్రాంతీయపార్టీల ఎంపీలు చెబుతున్నారట.
అయితే అలా చెప్పిన ఒక్క ఎంపీనీ చూపించరు.. ఒక్క ఎంపీతోనూ మాట్లాడించరు. కానీ ఏదో జరిగిపోతుందని మాత్రం బిల్డప్ ఇస్తుంటారు. సోమవారం పార్లమెంట్‌లో ఇంగ్లీష్ మీడియం అంశాన్ని టీడీపీ లేవనెత్తింది. తెలుగు భాష భవిష్యత్‌కు భరోసా కల్పించాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని కోరారు. అంతే..ఇక నాని పేరుతో ఒకటే బ్రేకింగులు వేసి ఢిల్లీ అంతా ఇదే అంశం చర్చించుకుంటున్నారన్నంత బిల్డప్ ఇచ్చేశాయి పసుపు గళాలు.