రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్...?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ నిన్న ఐదో అగ్రి మిషన్ సమావేశంలో పంటల ధరలు ఎక్కడ పడిపోతుంటే అక్కడ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డ్ ఉండాలని జగన్ అధికారులకు సూచించారు.
సీఎం జగన్ 2020 జనవరి 1వ తేదీ నుండి గ్రామ సచివాలయాల పక్కన దుకాణాలను, వర్క్ షాపులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.. ఈ దుకాణాలు, వర్క్ షాపుల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ దుకాణాల్లో దొరికే ప్రతి వస్తువుకు ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. వర్క్ షాపులో భూసార పరీక్షలను నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.
అధికారులు సీఎం జగన్ కు వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 45,20,616 రైతు కుటుంబాలు లబ్ధి పొందాయని వివరించారు. సొసైటీ కింద భూములను సాగు చేసుకుంటున్న వారిని, దేవాలయాల భూములు సాగు చేసుకుంటున్న వారిని కూడా రైతుభరోసా కింద తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు బయోపెస్టిసైడ్స్ నియంత్రణ చట్టాన్ని త్వరలో తీసుకురానున్నట్టు చెప్పారు. స్థానిక పౌల్ట్రీ రైతుల నుండి అంగన్ వాడీ స్కూలు, మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు కోడిగుడ్లను సరఫరా చేసేలా టెండర్లను పిలవాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. కౌలు రైతులు సహా అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా పథకం కింద లబ్ధి చేకూరుస్తామని మంత్రి కన్నబాబు చెప్పారు.