క్లైమాక్స్ కు చేరిన ఆర్టీసీ సమ్మె... సమ్మె విరమణ వైపే మొగ్గు...?
ఆర్టీసీ కార్మికుల సమ్మె క్లైమాక్స్ కు చేరుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మెపై ముందుకు వెళ్లాలా...? లేక వెనక్కు తగ్గాలా...? అనే అంశంపై ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె అంశం లేబర్ కోర్టు పరిధిలోకి వస్తుందని హైకోర్టు చెప్పటంతో ఈరోజు కార్మిక సంఘాల నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ముందుగా తలపెట్టిన సడక్ బంద్ ను కూడా వాయిదా వేశారు.
ప్రభుత్వం కార్మికులను చేర్చుకోవాలనే అంశం గురించి వేచి చూసే ధోరణిలో ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 46వ రోజుకు చేరుకుంది. ఈరోజు సమ్మె గురించి కీలకమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలల నుండి వేతనాలు అందలేదు.
ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం అన్ని డిపోల దగ్గర దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక ఆర్టీసీ కార్మికుడు మాట్లాడుతూ హైకోర్టు 45 రోజుల సమ్మె తరువాత సమ్మె తమ పరిధిలోకి రాదని చెప్పటం ఎంతవరకు సమంజసమో తెలియటం లేదని చెప్పాడు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికలను మాత్రమే అడుగుతున్నారని ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయటాన్ని కూడా పక్కన పెట్టామని ఆర్టీసీ కార్మికుడు చెప్పాడు.
ఈరోజు 10.30 గంటలకు జేఏసీ నేతల సమావేశం జరగబోతుందని జేఏసీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందని ఆర్టీసీ కార్మికుడు చెప్పాడు. జేఏసీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఆర్టీసీ కార్మికులు కట్టుబడి ఉంటామని ఆర్టీసీ కార్మికుడు చెప్పాడు. ఆర్టీసీ కార్మికులు సీఎం కు బిడ్డలతో సమానమని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నామని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు.