ఏమిటి? దేశంలో విద్యార్థులు ఇలా గర్జిస్తున్నారు.. !

NAGARJUNA NAKKA

దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ఢిల్లీ జె.ఎన్.యు, మద్రాస్ ఐఐటీ, బెనారస్ హిందూ వర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీల్లో వరుసగా జరుగుతున్న ఆందోళనలు.. అధికారుల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న ఫీజు పెరుగుదలకు వ్యతిరేక నిరసనలు ఇప్పట్లో చల్లారేలా లేవు. 


ఢిల్లీలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో పెంచిన మెస్ ఛార్జీలు తగ్గించాలనే డిమాండ్ తో విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తంగా మారడంతో.. జె.ఎన్.యులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. క్యాంపస్ లో భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. అధికారులు నచ్చజెబుతున్నా.. విద్యార్థులు ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. పెంచిన ఛార్జీలు బేషరతుగా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

మద్రాస్ ఐఐటీలో విద్యార్థిని ఫాతిమా లతీఫ్ సూసైడ్.. కలకలం రేపింది. సూసైడ్ నోట్ లో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు రోడ్డెక్కారు. ఫాతిమా లతీఫ్ కేరళ విద్యార్థిని కావడంతో.. ఆ రాష్ట్ర సీఎం విజయన్.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు సీఎం పళనిస్వామికి లేఖ రాశారు. దీంతో నిజానిజాలు నిగ్గుతేల్చానే డిమాండ్ తో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మతపరమైన వేధింపులతోనే లతీఫ్ సూసైడ్ చేసుకుందని చెబుతున్నారు.

 

బెనారస్ హిందూ వర్సిటీలో ముస్లిం ప్రొఫెసర్ సంస్కృతం బోధించడమేంటని విద్యార్థులు భగ్గుమన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిరోజ్ ఖాన్ కు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. పదకొండు రోజుల క్రితం వర్సిటీలో జాయిన్ అయిన ఫిరోజ్ ఖాన్.. కొన్నిరోజులుగా విద్యార్థుల్ని తప్పించుకుని తిరుగుతున్నారు. తన జీవితమంతా సంస్కృతమే చదివాననీ, ఓ ముస్లింగా ఎప్పుడూ భావించలేదనీ, కానీ ఇప్పుడు విద్యార్థుల ఆందోళన బాధిస్తుందని ఆయన చెప్పారు. 

 

మొత్తానికి మన దేశంలో విద్యార్థులకు కోపం వచ్చింది. పలు సమస్యలపై వారు పోరాడుతున్నారు. తమకు విద్యతో పాటు అనకూల వాతావరణం కోసం గళం విప్పుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి విద్యార్థుల సమస్యలను తీర్చాలని మనమూ కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: