జాతీయ పౌర జాబితాపై అమిత్ షా కీలక ప్రకటన !
జాతీయ పౌర జాబితా ప్రక్రియను దేశమంతటా అమలు చేస్తామని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. మతాన్ని బట్టి ఎలాంటి వివక్ష ఉండబోదని స్పష్టం చేశారు. అయితే... పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ల పరిస్థితి ఏమిటి..? జాబితాలో పేరు లేని వాళ్ల సంగతేమిటి..?
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ - NRCని దేశ వ్యాప్తంగా అమలు చేసే విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. రాజ్యసభలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క మతాన్నో లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న ప్రక్రియ కాదన్నారు. అందువల్ల ఏ మతస్తులు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు అమిత్ షా.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్‌లలో వేధింపుల వల్ల తలదాచుకోడానికి భారత్‌కు వచ్చిన వాళ్లను ఆదరిస్తామన్నారు అమిత్ షా. హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు అనే తేడా లేకుండా భారత పౌరసత్వం కల్పిస్తామన్నారు. ఈ విషయంలో ఎలాంటి వివక్ష ఉండబోదని... కొందరు సృష్టిస్తున్న పుకార్లను నమ్మొదన్నారు అమిత్ షా. ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ బిల్లు రెండు వేర్వేరన్నారు అమిత్ షా . సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అసోంలో ఎన్ఆర్సీని చేపట్టినట్టు వివరించారు. అయితే... ఎన్ఆర్సీని దేశమంతా చేపట్టే సమయంలో... అసోంలో మరోసారి ఈ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు.
ఎన్ఆర్సీలో పేరు లేని వాళ్లు ట్రైబ్యునల్‌కు వెళ్లే హక్కు ఉందని తెలిపారు కేంద్ర హోం మంత్రి. అలాంటి వారి కోసం అసోం వ్యాప్తంగా ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రైబ్యునల్‌కు వెళ్లే ఆర్థిక స్థోమత లేని వాళ్లకు అసోం ప్రభుత్వమే ఖర్చులను భరిస్తుందని స్పష్టం చేశారు అమిత్ షా. గత ఆగస్టు 31న వెలువడిన అసోం జాతీయ పౌర జాబితాలో 3 కోట్ల 11 లక్షల మందికి చోటు దక్కింది. అయితే, 19 లక్షల మందిని విదేశీయులుగా తేల్చారు. జాబితాలో లేకపోయినా ఎవరినీ విదేశీయులుగా పరిగణించబోమని హామీ ఇచ్చింది కేంద్రం. దేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది. కాగా, అసోంలో ఎన్‌ఆర్సీ ప్రక్రియపై అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.