ఇసుక అక్రమ రవాణా కేసులో ఏపీలో తొలి శిక్ష... మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా...!

Reddy P Rajasekhar

ఏపీలో ఇసుక అక్రమ రవాణా తొలి కేసు నమోదై నిందితునికి శిక్ష పడింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజు పల్లిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న కేసులో ఒక వ్యక్తికి కడప జిల్లా న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించారు. సీఎం జగన్ సొంత జిల్లాలో తొలికేసు నమోదు కావటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. 
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఇసుక అక్రమ అక్రమ రవాణా చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటన చేశారు. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహించాలని నీలం సహానీ ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని కూడా నీలం సహాని సూచించారు. 
 
మరోవైపు సీఎం జగన్ ఇసుక అక్రమ రవాణా గురించి ఫిర్యాధులు స్వీకరించేందుకు 14500 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణా, అధిక ధరలకు అమ్మడాన్ని నిరోధించటం, దొంగచాటుగా నిల్వ చేయడం నిరోధించేందుకు సీఎం జగన్ ఈ ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ఇసుక సమస్య ఉన్న ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 
 
సీఎం జగన్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. కేబినేట్ కొన్ని రోజుల క్రితం అధిక ధరలకు ఇసుక విక్రయించినా, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినా , పరిమితికి మించి ఇసుక కలిగి ఉన్నా 2 లక్షల రూపాయల వరకు జరిమానా, జైలు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇసుకను ప్రతి నియోజకవర్గం నుండి ఒక స్టాక్ పాయింట్ ద్వారా విక్రయించాలని ఇందుకోసం 2 లక్షల టన్నుల ఇసుక సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: