పవన్.. టైటిల్ అద్దిరిపోయింది.. మీ నలుగురి పిల్లలకీ తెలుగు నేర్పు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తృభాషను, మన నదులను రక్షించుకుందామంటూ ‘మన నుడి-మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ‘మన నుడి-మన నది’ అవశ్యకతను వివరిస్తూ ట్విట్టర్ లో ఆయన ట్విట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మన నుడి-మన నది’ ఉద్యమానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచీకరణ నేపథ్యంలో జాగ్రత్త పడకపోతే తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జలవనరుల కోసం మన నదులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయడ్డారు. అయితే ఆయన ట్వీట్ కు అనూహ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి కౌంటర్ వచ్చింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసిపి ఎమ్.పి విజయసాయిరెడ్డి ఒక సలహా ఇచ్చారు. ఆయన ఒక ట్వీట్ చేస్తూ ‘మన నుడి, మన నది. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది. ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి. తర్వాత మీకు ప్యాకేజీఇచ్చే యజమాని కృష్ణానదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలి. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుంది’ అని అన్నారు.
అయితే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ "మన బడి - మన నది" కార్యక్రమానికి ఇద్దరు కీలక వ్యక్తులు మద్దతునిచ్చారు. వారిలో ఒకరు ప్రముఖ కవి జొన్నవిత్తల రామలింగేశ్వర రావు.మరొకరు మండలి బుద్ధ ప్రసాద్. వీరిద్దరూ హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించారు. ఇదే అంశంపై వారు స్పందిస్తూ, పవన్ చేపట్టిన 'మన నుడి - మన నది' కార్యక్రమానికి తాము మద్దతు ఇస్తున్నట్టు ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భాషాభిమాని మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు.