గుంటూరులో మత్తుపదార్థాల కలకలం !
గుంటూరులో మత్తు పదార్థాల వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. రాజధాని ప్రాంతం కావటం, ఆపైన విదేశీ విద్యార్థుల నుండి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవటం తీవ్ర స్థాయిలో కలకలం రేపుతోంది.
గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విదేశీయుడి నుండి మత్తు పదార్దాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్ మెంట్ లో రహస్యంగా డ్రగ్స్ తయారీ చేసి ఏకంగా ఆన్ లైన్ లో విక్రయాలు చేస్తున్న సౌదీ దేశస్తుడు షాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. షాజీ ప్లాట్ లో గ్లౌజ్ లు, ఫేస్ మాస్క్ లు లభ్యం కావటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. షాజీ బైక్ కు నెంబర్ ప్లేట్లు లేకపోవటం పై పోలీసులు అరా తీస్తున్నారు. అంతే కాదు షాజీ గదిలో ఐదారు రకాల నెంబర్ ప్లేట్స్ లభ్యం కావటంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అంతే కాదు షాజీ గదిలో లభించిన తెల్లరంగు పౌడర్ ఏంటన్నది ప్రశ్నార్దకంగా మారింది.
పోలీసులు స్వాదీనం చేసుకున్న పౌడర్ ను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. ఇక.. షాజీ రూమ్ లో గంజాయి ప్యాకెట్లు కూడ లభించాయి. గంజాయి పదార్థాలకు మరో పదార్థాన్ని జోడించి మత్తు డోస్ పెరిగే విధంగా కొత్త రకం మత్తు పదార్థాన్ని షాజీ తయారు చేస్తున్నాడా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. గతంలో విజయవాడలో కూడా మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ ఒక విదేశీ విద్యార్థుల బృందం పోలీసులకు చిక్కింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు గుంటూరులో ఉన్న షాజీపై పోలీసులు నిఘాను పెట్టారు. అపార్ట్ మెంట్ వద్ద పోలీసులు కదలికలను పరిశీలించిన షాజీ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ.. చివరికి దొరికాడు. పట్టుబడిన వ్యక్తి విదేశీయుడు కావటంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. సాంకేతికంగా అసలు విషయాలు పరిశీలించిన తరువాత వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.