ఎంఎల్ఏలపై ఆశలు వదిలేసుకున్నారా ?

Vijaya
కడప జిల్లా పర్యటనలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అనుమానం వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచింది 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పార్టీ ఘోర ఓటమి, చంద్రబాబుకు వయసైపోవటం, నారా లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేకపోవటంతో నేతలు ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. పార్టీలోని ఎంఎల్ఏల్లో ఎవరు ఎపుడు టిడిపికి రాజీనామా చేస్తారో కూడా తెలీటం లేదు.

ఈ నేపధ్యంలోనే చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కడపకు వెళ్ళారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ’తాను ఐదేళ్ళపాటు రేయింబవళ్ళు కష్టపడితే తనకు కుటుంబం, కార్యకర్తలు మాత్రమే మిగిలారు’ అంటూ భోరుమన్నారు. ఇక్కడ కుటుంబం అన్నారే కానీ టిడిపినే తన కుటుంబం అనుకుంటన్నారా ? లేకపోతే  నారా లోకేష్ మాత్రమే తన కుటుంబం అనుకుంటున్నారా ? అనే విషయంలో క్లారిటి ఇవ్వలేదు.

సరే ఆ విషయాన్ని పక్కనపెట్టేస్తే తనకు కార్యకర్తలు మాత్రమే మిగిలారని చెప్పటమేంటి ? పార్టీ తరపున 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలున్నారు కదా ? అంటే చివరకు వీళ్ళుంటారనే నమ్మకం కూడా చంద్రబాబులో  పోయిందా .

ఇప్పటికే 23 మంది ఎంఎల్ఏల్లో గన్నవరం నుండి గెలిచిన వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసేశారు. విశాఖ నగరం ఉత్తర నియోజకవర్గంలో గెలిచిన గంటా శ్రీనివాసరావు కూడా బిజెపిలోకి వెళ్ళిపోవటం ఖాయమంటున్నారు. ఆయనతో పాటు మరో 10 మంది ఎంఎల్ఏలు కూడా టిడిపికి రాజీనామా చేయటానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపధ్యంలోనే కడపలో చంద్రబాబు తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారింది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే పార్టీలో ఎక్కువమంది ఎంఎల్ఏలు ఎన్నో రోజులు ఉండరనే విషయంలో చంద్రబాబుకు కూడా క్లారిటి ఉన్నట్లే అర్ధమవుతోంది. అందుకనే తాను రేయింబవళ్ళు కష్టపడితే చివరకు మిగిలేది కుటుంబసభ్యులు, కార్యకర్తలే అని నిర్వేదంగా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: