తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్...?
దేశమంతటా ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యులకు కన్నీరు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి 90 రూపాయల నుండి 110 రూపాయల వరకు పలుకుతోంది. మహారాష్ట్రకు చెందిన మొదటి రకం ఉల్లిగడ్డ కిలో వేలంలో 90 రూపాయలు పలుకుతోంది. ఉల్లి ధరలు పెరుగుతూ ఉండటంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడటంతో ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ప్రజలకు 40రూపాయలకు కిలో ఉల్లి అందించాలని నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల నుండి మార్కెటింగ్ శాఖ సేకరించి ప్రజలకు ఉల్లిని విక్రయించనుంది. సీఎం సూచనల మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి 40 రూపాయలకు కిలో ఉల్లి అందించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శికి సూచించారు.
మంత్రి ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యదర్శి వ్యాపారులతో చర్చలు జరిపారు. మార్కెటింగ్ శాఖ రవాణా చార్జీలను, హమాలీ చార్జీలను భరిస్తోంది. హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్, మెహదీపట్నం రైతు బజార్ లలో ఈరోజు నుండి కిలో ఉల్లి 40 రూపాయలకే లభించనుంది. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో దశల వారీగా ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయబోతుంది.
ఉల్లి విక్రయ కేంద్రాల ద్వారా ఒక వినియోగదారునికి ఒక కిలో ఉల్లిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండు నెలల క్రితం కిలో ఉల్లి 20రూపాయలు ఉండగా నేడు ఉల్లిపాయల ధరలు కేజీ 100 రూపాయలకు చేరడం ఆందోళన కలిగించే విషయం. మరోవైపు ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను 25 రూపాయలకు విక్రయిస్తోంది. కర్నూలు జిల్లా రైతుల నుండి ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు బజార్లకు పంపిస్తోంది.