ఎమ్మార్వో ఆఫీసులో రెచ్చిపోయిన ఉద్యోగి.... ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన వ్యక్తిపై దాడి...!

Reddy P Rajasekhar

కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ కార్యాలయంలో ఒక ధరఖాస్తుదారుడిపై రెవిన్యూ ఉద్యోగి జులుం ప్రదర్శించారు. కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న పవన్ కుమార్ ఒక వ్యక్తిపై దాడికి దిగాడు. ముసునూరు గ్రామానికి చెందిన బాబూరావు కుల ధ్రువీకరణ పత్రం కోసం ధరఖాస్తు చేసుకున్నాడు. తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన బాబూరావు కంప్యూటర్ ఆపరేటర్ ను తన ధ్రువీకరణ పత్రం గురించి ప్రశ్నించాడు. 
 
ఆ తరువాత బాబూరావ్, పవన్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తరువాత వాగ్వాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే ముద్దాల బాబూరావు కుల ధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల క్రితం ధరఖాస్తు చేశాడు. కుల ధ్రువీకరణ పత్రం కోసం రోజూ తహశీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్నాడు. కానీ ధ్రువీకరణ పత్రం మాత్రం అతనికి అందలేదు. 
 
వారం రోజులుగా తిరుగుతున్నా తనకు కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయకపోవటంతో బాబూరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కంప్యూటర్ ఆపరేటర్ పవన్ కుమార్ ను లంచం ఇవ్వనిదే ధ్రువపత్రం ఇవ్వరా...? అని బాబూరావు నిలదీశాడు. అలా బాబూరావు నిలదీయడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ పవన్ కుమార్ కోపంతో ఊగిపోయాడు. 
 
పవన్ కుమార్ బాబూరావుపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాబూరావు కంటికి గాయమైంది. బాబూరావు, పవన్ కుమార్ ఇద్దరూ పోలీసులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం తరువాత ఎమ్మార్వో కార్యాలయాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మార్వో విజయారెడ్డి ఘటన తరువాత కర్నూలు జిల్లా గూడూరు ఎమ్మార్వో షేక్ హసీనా బీ 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులు తన బినామీని పట్టుకోవడంతో పరారీలో ఉన్నారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: